
తమిళనాడు, తిరువొత్తియూరు: కుటుంబకలహాలతో భార్యను భర్త కడతేర్చాడు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా అంజు గ్రామం కనకప్పపురానికి చెందిన డాల్టన్ సెల్వ ఎడ్వర్డ్ (40). అతని భార్య జగదీషిని (33). వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జగదీషిని పాల్‌కులంలో ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేవారు. కుటుంబ కలహాలతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ ఏర్పడింది.
ఆ సమయంలో ఆగ్రహించిన డాల్టన్ సెల్వ ఎడ్వర్డ్ కత్తితో భార్యపై దాడి చేసి పారిపోయాడు. ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను చుట్టుపక్కల వారు నాగర్‌కోవిల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం జగదీషిని మృతి చెందింది. నాగర్‌కోవిల్ పోలీసులు పరారైన జగదీషిని భర్త కోసం గాలిస్తున్నారు.