చంపేసి..ఆపై కనిపించడం లేదంటూ! | Husband Kills Wife And Lodged A Missing Compliant | Sakshi
Sakshi News home page

చంపేసి..ఆపై కనిపించడం లేదంటూ!

Published Mon, Jul 8 2019 7:54 AM | Last Updated on Mon, Jul 8 2019 7:55 AM

Husband Kills Wife And Lodged A Missing Compliant - Sakshi

సాక్షి, గన్నవరం: అనుమానంతో కట్టుకున్న భార్యనే హతమార్చాడు.. ఎవ్వరికీ కనపడకుండా ముళ్లకంచెల్లో పడేసి ఏమీ తెలియనట్లుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కళ్లు గప్పేందుకు రోజు స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఆచూకీ గురించి వాకబు చేస్తూ కపట ప్రేమను కనబరిచాడు. చివరికి ఆ భర్తపైనే అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం ఒప్పుకున్నట్లు సమాచారం.

వివరాలు.. కంకిపాడుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానుమోలు శివనాగరాజకు పదేళ్ల కిందట శిరీష(31)తో వివాహం జరిగింది. వీరికి పాప, బాబు ఉన్నారు. కొంత కాలం నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న శివనాగరాజు తరచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. గత నెల 25న శివనాగరాజు తల్లి ధనలక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని ఆస్పత్రిలో చేర్చాడు. దీంతో అత్తకు సపర్యలు చేసేందుకు శిరీష కూడా ఆస్పత్రిలోనే వద్ద ఉంది. గత నెల 26వ తేదీ రాత్రి ఆస్పత్రికి వచ్చిన శివనాగరాజు ఇంటికి కారులో తీసుకెళ్లాడు. కేసరపల్లి ఏలూరు కాలువ పక్కన నిర్మానుషంగా ఉండే రోడ్డులో కారు ఆపి ఆమె తలపై రాడ్‌తో కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న ముళ్లకంచెల్లో పడేసి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. 

కనిపించడం లేదంటూ..

రెండు రోజుల అనంతరం ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన శివనాగరాజు పిన్నమనేని ఆస్పత్రికి వచ్చిన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీనితో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తూ ఆచూకీ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నాడు. అయితే అతను తడబాటుకు గురవుతుండడం గ్రహించిన పోలీసులు గతంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో భార్యను హత్యచేసినట్లు నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఏలూరు కాలువ పక్కనే ఉన్న రోడ్డులో ముళ్లకంచెల్లో పడివున్న పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు మర్డర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement