
మృతురాలు జీతూ (పాత ఫోటోలు)
సాక్షి, తిరువనంతపురం: కేరళలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళను ఆమె భర్త తగలబెడుతుంటే.. జనాలు చూస్తూ ఉండిపోయారు. ఘటన తర్వాత కూడా ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర గాయాలతో ఆ మహిళ రెండు రోజుల తర్వాత కన్నుమూసింది. హేయనీయమైన ఈ ఘటన త్రిస్సూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... జీతూ(29) తన భర్త విరాజ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉండగా విరాజ్ తన భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఓ లోన్ పని నిమిత్తం ఆమె తన తండ్రితో కలిసి చెంగళూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో భర్త విరాజ్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్ పోయటంతో ప్రాణాల కోసం ఆమె పరుగెత్తారు. జీతూ తండ్రి తన కూతురిని కాపాడాలంటూ అక్కడున్న వారందరి కాళ్ల వేళ్ల పడ్డారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. చివరకు ఆమె మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ అక్కడే కుప్పకూలిపోయింది.
కనికరం చూపలేదు... ఘటన తర్వాత విరాజ్ అక్కడి నుంచి పారిపోగా.. తీవ్ర గాయాలపాలైన జీతూను ఆస్పత్రికి తరలించేందుకు తండ్రి అక్కడున్న వారి సాయం కోరారు. కాళ్లా వేళ్లా పడ్డ ఎవరూ కనికరం చూపలేదు. చివరకు ఓ ఆటోడ్రైవర్ సాయంతో జీతూ తండ్రి ఆమె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ ఘటనలో స్థానిక వార్డు మెంబర్ హస్తం కూడా ఉందని జీతూ తండ్రి వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక వేసి తన కూతురిని అక్కడికి రప్పించి మరీ హత్య చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ‘ఉగ్రవాదులకు కూడా మన దేశంలో మంచి ఆతిథ్యం ఇస్తారు. అలాంటిది నా కూతురు తగలబడి పోతున్నా సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విరాజ్‌ను బుధవారం రాత్రి ముంబైలో అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment