
ఇండోర్ (మధ్యప్రదేశ్): దాదాపు 10 దేశాలకు చెందిన మహిళలతో 30 ఎస్కార్టు వెబ్‌సైట్లు నడుపుతున్న ఓ యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్షల్ ఝా(30) బీటెక్ వరకు చదువుకున్నాడు. 2014లో ఇతడికి సాగర్ జైన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతడు అప్పటికే వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్నాడు. అతడి సూచనలు, సలహాలతో ఎస్కార్టు సర్వీస్‌ను ప్రారంభించేందుకు హర్షల్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఛండీగఢ్‌కు చెందిన వికాస్ బత్రా అలియాస్ రాహుల్ సాయంతో ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, ఇంగ్లండ్ దేశాల అడల్ట్ వెబ్‌సైట్ల సెర్చ్ ఇంజిన్లను నిర్వహించటం నేర్చుకున్నాడు.
అప్పటి నుంచి దాదాపు 10 దేశాలకు చెందిన వ్యభిచారిణులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని, ఇండోర్ కేంద్రంగా సేవలను అందజేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇండోర్ పోలీసులు హర‍్షల్‌ను అదుపులోకి తీసుకుని, అతనిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.