రఘునాథపల్లి: పట్టుదలతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలనుకున్న ఆ విద్యార్థిని అర్ధంతరంగా తనువు చాలించింది. పేదరికం కారణంగా చదువు మానేయాలని తండ్రి ఆదేశించడంతో మస్తాపానికి గురైన ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పారునంది కరుణాకర్, సుశీల దంపతుల కుమార్తె ప్రియాంక (17) ఇంటర్మీడియట్ చదువుతోంది. కరుణాకర్ గ్రామంలోని ఓ రైతు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. కూతురును చదువు మానేయాలని తండ్రి సూచించగా తాను చదువుకుంటానని వారించింది.
ఈ క్రమంలో కూతురును తండ్రి మందలించాడు. ఆ తర్వాత కరుణాకర్ తన కుమార్తెతో కలిసి పత్తి చేనులో కలుపు కుప్పలు తీసేందుకు వెళ్లారు. కొద్ది సేపటికి ఇంటికి వెళ్లి తల్లిని తీసుకొస్తానని కుమార్తెకు చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రియాంక అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వచ్చి చూడగా ప్రియాంక అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment