కళాశాల వద్ద బైఠాయించిన విద్యార్థులు
జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ – ఉద్యాన కళాశాల బాయ్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగింది. జూనియర్ల పట్ల సీనియర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. సీనియర్ల తీరును నిరసిస్తూ బాధితులు జూనియర్లతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన కళాశాల కావడంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు.
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని రావి వెంకటాంపల్లి సమీపంలో జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ – ఉద్యాన కళాశాలకు చెందిన బాయ్స్ హాస్టల్‌ను అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో హాస్టల్‌లోని సీనియర్ విద్యార్థులు, డేస్కాలర్స్ విద్యార్థులు హార్టికల్చర్ విద్యార్థిని షేవింగ్ చేయించుకోవాలంటూ ర్యాగింగ్ చేశారు. అందుకు ప్రతిఘటించిన హార్టికల్చర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. వారించిన మరికొంత మంది జూనియర్లను కూడా ఒంటిపై దుస్తులు లేకుండా చేసి దాదాపు నాలుగు గంటల పాటు మోకాళ్లపై మట్టిలో నిల్చోబెట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు.
సీనియర్లపై చర్యలు తీసుకోండి
ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు తోటి విద్యార్థుల సహాయంతో శనివారం ఉదయం కళాశాల అసోసియేట్ డీన్‌కు ఫిర్యాదు చేశారు. సానుకూల స్పందన లభించకపోవడంతో విద్యార్థులు కళాశాలలోనే ఆందోళనకు దిగారు. తరగతుల్లోకి వెళ్లకుండా మూ డు గంటల పాటు ఆందోళన చేశారు.
డీన్ గదిలో రహస్యంగా విచారణ చేస్తున్న ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి
రహస్య విచారణ
విద్యార్థుల ఆందోళన గురించి సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి స్పెషల్‌పార్టీ పోలీసులతో వ్యవసాయ కళాశాలకు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని కరస్పాండెంట్ రెడ్డప్పరెడ్డి గదిలోకి తీసుకెళ్లి రహస్యంగా విచారించారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. జరిగిన ఘటనపై నోరుమెదపకుండా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ర్యాగింగ్ జరిగిన విషయం బయటకు చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని యాజమాన్యం విద్యార్థులను హెచ్చరించినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment