గతేడాది డిసెంబర్ 29న ఉడుములపాడులో స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం బాటిళ్లు
కేఈ బ్రదర్స్. ఈ పేరు చెప్పగానే దాదాపు మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులకు గుర్తొచ్చేది మద్యం వ్యాపారం. దీని ద్వారానే వారు ఆర్థికంగా ఎదిగి.. రాజకీయాల్లో చక్రం తిప్పారు. మద్యం వ్యాపారంతో పాటు నకిలీ మద్యం కూడా తయారు చేసేవారని తెలుస్తోంది. డోన్ మండలం ఉడుములపాడులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేఈ ప్రతాప్ పేరు చేర్చారు. ఆయనతో సహా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో టీడీపీ నాయకులు..అది కూడా కేఈ అనుచరులే ఎక్కువగా ఉండడం గమనార్హం. గోవా, కర్ణాటక కేంద్రంగా నకిలీ మద్యం తయారీ వీరి కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తోంది. కేసులను పరిశీలిస్తే మద్యం రాకెట్ గోవా నుంచి కర్నూలు వరకూ విస్తరించినట్లు స్పష్టమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో నకిలీ మద్యం వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతోంది. గోవా, కర్ణాటక నుంచి ఇది సరఫరా అవుతోంది. గోవాలోని ఓ బేవరేజస్‌లో నకిలీ మద్యం తయారు చేసి, నకిలీ లేబుళ్లు అతికించి వేల కేసులను ‘సీమ’కు సరఫరా చేసేవారు. డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలుతో పాటు కడప, చిత్తూరు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలకు కూడా ఇది సరఫరా అయ్యేది. కంటైనర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసేవారు. దీంతో పాటు నాటుసారా ఎక్కువగా కాసేవారు. ఈ దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగింది. తాజాగా డోన్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును పరిశీలిస్తే ఏళ్ల తరబడి నకిలీ మద్యం దందా ఎలా సాగిందో స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో వారికి కొందరు ఎక్సైజ్ అధికారుల అండ కూడా ఉండేది. ఫలితంగా భారీ ముడుపులు స్వీకరించేవారని తెలుస్తోంది.
ఐదేళ్ల కిందటే గుట్టురట్టు
నకిలీ మద్యం కర్నూలు జిల్లాకు సరఫరా అవుతోందని 2014 డిసెంబర్ 7న అనంతపురం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. 8వ తేదీ రాత్రి నిఘావేసి గుత్తి హైవేలో ఓ కంటైనర్‌ను పట్టుకున్నారు. అందులో వేల సంఖ్యలో మెక్‌డొవెల్స్, ఇతర బ్రాండ్ల పేరిట ఉన్న మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా మొత్తం నకిలీ మద్యమని తేలింది. ఈ కేసులో అప్పట్లో ఎనిమిది మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఏ1గా గోవాలోని డ్రైవర్ గుల్జార్ హుస్సేన్, ఏ2గా జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిందర్‌లాల్, ఏ3గా బెంగళూరు వాసి కార్గో రమేశ్, ఏ4గా బంటిసింగ్(గోవా), ఏ5గా రమేశ్‌సింగ్(హర్యానా), ఏ6, ఏ7, ఏ8గా బెంగళూరు వాసులు రామయ్య, శివన్న, రాకేశ్‌లపై చార్జ్‌షీటు వేశారు.
అప్పటి మంత్రి జోక్యంతో కేసు తారుమారు
కంటైనర్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు గోవాకు వెళ్లి అక్కడి బేవరేజస్‌ను పరిశీలించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు తేలడంతో రామయ్య అనే వ్యక్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కర్నూలు జిల్లా డోన్‌కు తీసుకెళుతున్నట్లు అప్పట్లో నిందితులుచెప్పినట్లు తెలిసింది. తాజాగా డోన్ పరిధిలో నమోదైన నకిలీ మద్యం కేసులో పేర్కొన్న వ్యక్తుల్లోని కొందరు అప్పట్లో ఈ కంటైనర్‌ను రప్పించారు. ఈ విషయం విచారణలో తేలింది. అయితే అప్పటి ప్రభుత్వ ‘పెద్ద’ జోక్యంతో కేసును తారుమారు చేశారని తెలుస్తోంది. కంటైనర్‌ను పట్టుకున్న పోలీసులు అది ఎక్కడికి వెళుతోంది? ఎవరు తెప్పించారనేది చార్జ్‌షీట్‌లో పొందపరచలేదు. ‘గుత్తికి కంటైనర్ చేరిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు ఆ స్థలానికి తీసుకురండి’ అని డ్రైవర్ చెప్పినట్లు పేర్కొని కేసును మూసేశారు. కంటైనర్ ఎక్కడికి వెళుతోందనేది తెలుసుకోవాలని ఎక్సైజ్ పోలీసులు భావించి ఉంటే ఫోన్‌కాల్ ఆధారంగా పట్టుకోలేరా అనేది తేలాల్సిన ప్రశ్న. కాగా ఈ కేసు ఎఫ్‌ఐఆర్ 2014లో నమోదు కాగా చార్జ్‌షీట్ మాత్రం 2018లో వేశారు.
తరచూ నకిలీ మద్యం సరఫరా
గోవా, కర్ణాటక నుంచి నకిలీ మద్యం తరచూ సరఫరా అయ్యేది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటం, జిల్లాలో కేఈ బ్రదర్స్ హవా నడవడంతో ఎక్సైజ్ పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో నకిలీ దందా యథేచ్ఛగా సాగింది. అలాగే ఆర్‌ఎస్ బేస్డ్ లిక్కర్‌ను కూడా వీరు సరఫరా చేసేవారు. మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా నూట్రల్ ఆల్కహాల్)బేస్‌డ్‌తో తయారవుతుంది. కర్ణాటకలో ఆర్‌ఎస్(రెక్టిఫై స్పిరిట్)బేస్డ్‌తో తయారు చేస్తారు. ఈఎన్‌ఏ లిక్కర్ డబుల్‌ఫిల్టర్, ఆర్‌ఎస్ సింగిల్‌ఫిల్టర్. ఆర్‌ఎస్‌తో పోలిస్తే ఈఎన్‌ఏ బేస్డ్ మద్యం తయారీకి వాడే స్పిరిట్ ధర ఎక్కువ. దీంతో ఆర్‌ఎస్ బేస్డ్ లిక్కర్ తక్కువ ధరతోనే లభిస్తుంది. దీంతో క్వార్టర్, డిప్‌లు ఎక్కువగా కర్ణాటక, గోవా నుంచి దిగుమతి చేసుకుంటారని తెలుస్తోంది. ట్యాక్స్ భారం కూడా ఉండదు. దీంతో వాటికి స్టిక్కర్లు అంటించి ఇక్కడి వైన్‌షాపుల్లో విక్రయించి రూ.కోట్లు దండుకున్నారు.
సెకండ్స్, థర్డ్‌తోనే థ్రెట్
బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటి రకం. ఇది మన వైన్‌షాపుల్లో విక్రయిస్తారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చేది ‘సెకండ్స్’. స్పిరిట్, మరిన్ని రసాయనాలతో ఇక్కడే తయారుచేసేది థర్డ్. సెకండ్స్‌తో పాటు థర్డ్ విక్రయాలు జోరుగా సాగించారు. వీటిని సేవించి ఆరోగ్యం గుల్ల చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపడంతో ‘డోన్’లోని ‘నకిలీ ముఠా’ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తే జిల్లాతో పాటు కర్ణాటక, గోవాలోని నకిలీ మద్యం తయారీ స్థావరాలు, ఇంకొందరు పెద్దమనషుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.
అయ్యప్పగౌడ్ అరెస్ట్
డోన్ టౌన్: నకిలీ మద్యం కేసులో 3వ నిందితుడిగా ఉన్న అయ్పప్పగౌడ్‌ను మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇతను గత ఐదేళ్లుగా డోన్‌లోని మద్యం సిండికేట్ కార్యాలయ వ్యవహారాలు చూసేవాడు. ఇతనితో నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇంకా 24 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీరిలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ ప్రతాప్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment