నకిలీ మద్యం కేసులో కేఈ ప్రతాప్‌ | TDP Leader KE Prathap in Adulterated Alcohol Case Kurnool | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యం కేసులో కేఈ ప్రతాప్‌

Published Tue, Feb 4 2020 12:26 PM | Last Updated on Tue, Feb 4 2020 12:26 PM

TDP Leader KE Prathap in Adulterated Alcohol Case Kurnool - Sakshi

నకిలీ మద్యం కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసిన దృశ్యం (ఫైల్‌) (ఇన్‌సెట్‌లో) డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌

టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనే ధ్యేయంగా తెగబడ్డారు.  ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోలేదు. చివరకు నకిలీ మద్యం కూడా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో స్వయాన మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో  మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో సహా 25మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

డోన్‌ :  సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో పాటు 25 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిండికేట్‌ లాభాల్లో కేఈ ప్రతాప్‌కు 25 శాతం, మిగిలిన వారు 75శాతం చొప్పున పంచుకున్నట్లు విచారణలో బహిర్గతమైంది. సిండికేట్‌లో మొత్తం 20 మంది ఉండగా అందరూ టీడీపీ నాయకులే కావడం విశేషం. వీరిలో అత్యధికులు కేఈ బంధువులు కావడం కూడా గమనార్హం. 2014  ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు  తాను అధికారంలోకి వస్తే ఆడపడచుల కన్నీళ్లు తుడిచేందుకు బెల్టుషాపులను రద్దుచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవిధంగా నకిలీ మద్యాన్ని తయారుచేసి బెల్ట్‌షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగించారు. సిండికేట్‌గా ఏర్పడిన ఈ ముఠా ప్రభుత్వ మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ముసుగులో వేలకొద్దీ నకిలీ మద్యం బాటిళ్ల కేసులను బెల్ట్‌షాపులకు సరఫరా చేసి కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడైంది.

తీగ లాగితే డొంక కదిలింది  
గత డిసెంబర్‌ 10వ తేదీన కృష్ణగిరి మండలం అమకతాడులో జయపాల్‌ రెడ్డి, కంబాలపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిని నకిలీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఉడుములపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రాంబాబు నకిలీ మద్యాన్ని రవాణా చేస్తూ పత్తికొండ వద్ద వాహనాన్ని తగిలించి వ్యక్తి మృతికి కారణం కావడంతో కేసు కొత్తమలుపు తిరిగింది. రాంబాబును విచారించిన అనంతరం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వినోద్‌ ఖలాల్‌ను గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్టుచేశారు.  అనంతరం టీడీపీ నేతల పాత్ర వెల్లడైంది.

నిందితులు వీరే  
 1.వినోద్‌ఖలాల్‌ (హుబ్లీ) 2.పుట్లూరు శ్రీను (టీడీపీ) 3.ఈడిగ అయ్యప్ప గౌడ్‌ (టీడీపీ) 4.ఈడిగ శ్రీనివాసగౌడ్‌ (అమరవాయి, తెలంగాణ రాష్ట్రం) 5.ఈడిగ బేతపల్లి రంగస్వామి 6.ఉప్పరి రాంబాబు(టీడీపీ) 7.ఈడిగ మనోహర్‌ గౌడ్‌ (టీడీపీ) 8.చిట్యాల మురళీగౌడ్‌ (టీడీపీ)9.దేవరబండ రాము గౌడ్‌ (టీడీపీ)10. రోహిత్‌ ఖలాల్‌ (హుబ్లీ) 11.రాకేష్‌ ఖలాల్‌ (హుబ్లీ) 12.సునీల్‌ ఖలాల్‌ (హుబ్లీ) 13.సంజు మార్వాడి (హుబ్లీ) 14.మంజు హగేరీ (హుబ్లీ) 15.వినాయక జతూరే (హుబ్లీ) 16 బాబు (హుబ్లీ) 17.అద్దంకి శ్రీనివాసరావ్‌ (టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 18.అద్దంకి గోపి ( టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 19.కృష్ణాగౌడ్‌ (టీడీపీ, తెలంగాణ రాష్ట్రం) 20.ఎల్లాగౌడ్‌ ( కర్ణాటక) 21.అల్లారుదిన్నె వెంకటేశ్‌ (టీడీపీ) 22.తలమరి రామలింగ (కర్ణాటక) 23.పరశురాం (కర్ణాటక) 24.ఉదయ్‌ గౌడ్‌ (టీడీపీ) 25.డీలర్‌ రాము గౌడ్‌ (టీడీపీ) 26.కేఈ ప్రతాప్‌ (నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌) 27.టీఈ కేశన్న గౌడ్‌ (మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్, టీడీపీ)  28.చిట్యాల లోకనాథ్‌ గౌడ్‌ (టీడీపీ),29.భాష్యం శ్రీనివాసులు (టీడీపీ మాజీ కౌన్సిలర్‌ భర్త)  30.కంబాల పాడు కేఈశ్యామ్‌ (మున్సిపల్‌ కోఆప్షన్‌ మాజీ సభ్యుడు, టీడీపీ) 31.గిద్దలూరు శ్రీనివాస గౌడ్‌ (టీడీపీ) 32.కటారుకొండ మర్రి శ్రీరాములు(శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు) 33.కటారుకొండ మర్రి మోహన్‌ రెడ్డి (టీడీపీ) 34.Ôశేఖర్‌గౌడ్‌ (టీడీపీ), 35.రామకృష్ణ (గుత్తి, అనంతపురం జిల్లా) 36. పీవీ రమణ (గుత్తి.)  

సిండికేట్‌ ఇష్టారాజ్యం  
మద్యం దుకాణాల నిర్వహణలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరి ప్రధాన కార్యాలయం నుంచే డోన్‌ నియోజకవర్గంలోని 131 గ్రామాలతో పాటు కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లోని మరో 65గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపులకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసి జోరుగా విక్రయించారు. ఎక్సైజ్‌శాఖలో కీలకపదవిలో ఉన్న ఒక ఉన్నతాధికారితో పాటు 2014 నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులందరికీ ఈ విషయం తెలిసినా మామూళ్లకు కక్కుర్తిపడి  బయటకు పొక్కనివ్వలేదనే ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement