
తప్పించుకున్న విద్యార్థి అజిత్
అనంతపురం, కళ్యాణదుర్గం రూరల్: కిడ్నాప్‌కు గురైన పదో తరగతి విద్యార్థి మార్గమధ్యలో తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాలిలా.. నారాయణపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, అంజినప్పల కుమారుడు అజిత్ స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు అజిత్‌ను ఆపి మల్లాపురం గ్రామానికి దారి అడిగారు. దారి చూపి ముందుకెళుతుండగా వారు పాఠశాల వద్ద దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు. పాఠశాల వద్ద ఆపకుండా వెళ్తుండటంతో గట్టిగా అరవడం తో కళ్లకు, నోటికి గంతలు కట్టి కంబదూరుకు తీసుకెళ్లారు. అక్కడి మద్యం కోసం దుకాణం వద్ద కారు ఆపిన సమయంలో విద్యార్థి తప్పించుకున్నాడు. సమీపంలో ఉన్న ఇళ్లలోకి వెళ్లి జరిగిన విషయాన్ని వారి ద్వారా తల్లిదండ్రులకు ఫోన్‌లో చేరవేశాడు. వారు అక్కడికి చేరుకొని బాలుడిని వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివశంకర్‌నాయక్ స్పందిస్తూ.. ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment