
రవి మృతదేహం , రోదిస్తున్న మృతుడి భార్య
నెల్లూరు, సంగం: ముందు వెళుతున్న ఆటోను వెనుకనుంచి మరో ఆటో ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన సంగం గురుకుల కళాశాల సమీపంలోని ఎర్రచెరువు వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దగదర్తి మండలం చెన్నూరుకు చెందిన చింతపండు రవి (35) స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రవి భార్య చెంచమ్మ తమ్ముడు చెంచయ్యకు ఏఎస్‌పేట మండలం శ్రీకొలనులో పెళ్లి సంబంధం చూశారు.
ఈ పనిపై అక్కడికి వెళ్లేందుకు రవి, చెంచమ్మ ఇద్దరు పిల్లలతో చెన్నూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెంకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో శ్రీకొలనుకు బయలుదేరారు. ఆటో సంగం ఎర్రచెరువు సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఎర్రచెరువులో నాలుగు ఫల్టీలు కొట్టింది. దీంతో చింతపండు రవి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య చెంచమ్మ, ఇద్దరు పిల్లలు, తోటి ప్రయాణికులు కనుపూరు గురుదేవి, లక్ష్మమ్మలు సైతం తీవ్రంగా గాయపడ్డారు. కాగా మద్యం సేవించి ఉన్న టాటా ఏస్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. మృత్యువాత పడిన భర్తను చూసి చెంచమ్మ గుండెలవిసేలా విలపిం చింది. సంగం పోలీసులు రవి మృతదేహాన్ని బుచ్చి రెడ్డిపాళెం మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment