సాక్షి, గుంటూరు: మైనర్‌పై లైంగిక దాడి కేసులో 56 సంవత్సరాల వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శిరిపురపు శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి.లక్ష్మి కథనం మేరకు...అమరావతి మండలంలో ఒక గ్రామానికి చెందిన దంపతులు వారికి కలిగిన సంతానం మరణించడంతో వారు గుంటూరు పట్టణానికి వలసవచ్చి రోజు వారి కూలీలుగా జీవిస్తున్నారు. దంపతుల్లో భార్య సోదరి దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి పది సంవత్సరాల కుమార్తెను వీరు తెచ్చుకుని పెంచుకుంటున్నారు.
బాలిక గుంటూరు నగరంలోని ఒక పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. వీరు నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో ఉండే అమృతపూడి కోటేశ్వరరావు బాలిక చదువుతున్న స్కూల్‌కు సైకిల్‌పై వెళ్లి, బాలికకు మాయమాటలు చెప్పి సైకిల్‌పై ఆయిల్ బంకు వెనుక వైపు ఉన్న పొదల్లో తీసుకెళ్లి 2018 జూలై 19, మరోసారి అదే సంవత్సరంలో జూలై 21వ తేదీన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక స్కూల్ నుంచి ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆమె పెంపుడు తల్లిదండ్రులు ప్రశ్నించారు. బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై జి.శివకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం తనపై అధికారి అయిన డీఎస్పీ కె.శ్రీనివాసులుకు అప్పజెప్పారు. డీఎస్పీ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితుడు కోటేశ్వరరావుపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైతీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment