చెన్నై,టీ.నగర్: టిక్‌టాక్‌లో స్నేహితురాలితో సన్నిహితంగా ఉండడాన్ని భర్త ఖండించడంతో వివాహిత పరారైన సంఘటన దేవకోట్టై సమీపంలో సంచలనం కలిగించింది. ఈ వివరాలు మంగళవారం వెల్లడయ్యాయి. శివగంగై జిల్లా కాళయారుకోవిల్ సమీపం సానాఊరణికి చెందిన వ్యక్తి ఆరోగ్య లియో. ఇతని భార్య వినీత. వీరికి గత జనవరిలో వివాహం జరిగింది. వివాహమైన 45 రోజుల్లో ఆరోగ్య లియో ఉద్యోగం కోసం సింగపూర్ వెళ్లాడు. తరువాత వినీతకు తిరువారూరుకు చెందిన అభి అనే యువతితో టిక్‌టాక్ వీడియో ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి టిక్‌టాక్ వీడియోలు గమనించిన ఆరోగ్యలియో తన భార్యకు ఫోన్ చేసి మందలించాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. తర్వాత కూడా అభితో స్నేహం చేస్తూ వచ్చింది. వీరి స్నేహం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అంతేకాకుండా వినీత, అభి ఫొటోను తన భుజంపై టాటూగా చిత్రించుకుంది. ఈ వీడియో చూసిన ఆరోగ్యలియో దిగ్భ్రాంతి చెందాడు. అతను సింగపూర్ నుంచి అత్యవసరంగా తన ఊరుకు చేరుకున్నాడు. ఇంటిలో అభి పంపిన అనేక బహుమతులు కనిపించాయి. వివాహ సమయంలో వినీత ధరించిన 20 సవర్ల నగలు మాయమయ్యాయి. దీని గురించి వినీతను ప్రశ్నించగా తగిన సమాధానం ఇవ్వలేదు. దీంతో తన తల్లిదండ్రుల ఇంటిలో వినీతను వదిలిపెట్టాడు. ఇలా ఉండగా ఇంటిలో వున్న వినీత ఈ నెల 19న హఠాత్తుగా మాయమైంది. పోలీసుల విచారణలో అభితో వినీత పరారైనట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment