రఘురామిరెడ్డిని పరామర్శిస్తున్న గౌరు వెంకటరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నందికొట్కూరు మండలం కోనేటమ్మపల్లికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రఘురామిరెడ్డిపై కర్నూలులో ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న దాబా ఎదుట మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రఘురామిరెడ్డి, అతడి అనుచరులు జగదీశ్వరరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డిలతో కలసి ఉన్నాడు. ఇంతలో ముఖానికి మాస్కులు ధరించిన ఐదారుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి కత్తులు, రాడ్లతో రఘురామిరెడ్డిపై విచక్షణరహితంగా దాడి చేశారు.
తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయన అక్కడిక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాడిలో జగదీశ్వరరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రఘురామిరెడ్డిని అశోక్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి అనే వ్యక్తులు విజయ హాస్పిటల్‌లో తరలించారు. కాగా, తనపై దాడికి పాల్పడింది బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులేనని బాధితుడు డీఎస్పీ ఖాదర్‌బాషాకు వాంగ్మూలం ఇచ్చారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆరేళ్ల క్రితం వరకు రఘురామిరెడ్డి, ఆయన తండ్రి తిరుపతిరెడ్డి బైరెడ్డి వర్గంలో ఉండేవారు. తండ్రి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురికావడంతో రఘురామిరెడ్డి వర్గాలకు దూరంగా ఉండేవాడు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుడిగా ఉంటూ గత ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
బైరెడ్డి అనుచరుల పనే...గౌరు వెంకటరెడ్డి
రఘురామిరెడ్డిని హత్య చేయడానికి ముమ్మాటికీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు కుట్ర పన్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. విజయ హాస్పిటల్‌లో ఉన్న రఘురామిరెడ్డిని గౌరు పరామర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వారు హత్యలను ప్రోత్సహిస్తూన్నారని గౌరు ఆరోపించారు. గత ఎన్నికల్లో నందికొట్కూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సాయి ఈశ్వర్‌ను బైరెడ్డి కుటుంబీకులు హత్య చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రఘురామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment