
హైదరాబాద్: నగర శివార్లలోని కొల్లూరు సమీపంలో వెలుగుచూసిన ఐదుగురి మృతి కేసులో దర్యాప్తు చేపట్టామని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. మృతులు పటాన్‌చెరు అమీన్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించామన్నారు. వీరికి మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చూడటానికి వెళ్తున్నట్టు చెప్పి కారులో వెళ్లారని వెల్లడించారు. ప్రభాకర్‌రెడ్డి, ఆయన బంధువు రవీందర్‌రెడ్డి, అతడి భార్య లక్ష్మికి డిమాట్ ఖాతాలున్నాయని.. వీటి ద్వారా రూ. కోటి 30 లక్షల విలువైన షేర్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఐదు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు రెండు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, తన కొడుకు షేర్ మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని, ఇందులో నష్టాలు వచ్చాయని ప్రభాకర్‌రెడ్డి తండ్రి మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక లావాదేవిల కారణంగా కొంతకాలంగా బాధల్లో ఉన్నాడని, దసరాకు కూడా తమ ఇంటికి రాలేదని వెల్లడించారు. షేర్ మార్కెట్‌లో ఎలాంటి నష్టం వచ్చినా అధైర్యపడొద్దని చాలాసార్లు చెప్పినట్టు ప్రభాకర్‌రెడ్డి బంధువు రవీందర్‌రెడ్డి తెలిపారు. ‘నా వ్యాపారాన్ని ప్రభాకర్‌రెడ్డి, నా భార్య లక్ష్మి చూసుకుంటోంది. వ్యాపారంలో నష్టం వచ్చిన సంగతి నాకు తెలియదు. ఎంత నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం ఆమెదికాదు. ప్రభాకర్‌రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి. మేం ఆర్థికంగా నష్టాల్లో లేము. బాగానే ఉన్నామ’ని రవీందర్‌రెడ్డి చెప్పారు.