అమెజాన్ కే కుచ్చుటోపీ! | Online Booking Cheaters Arrest | Sakshi
Sakshi News home page

బుక్‌ చేసి.. బుకాయిస్తారు..

Published Sat, Apr 14 2018 9:29 AM | Last Updated on Sat, Apr 14 2018 9:39 AM

Online Booking Cheaters Arrest - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌

గచ్చిబౌలి: అమెజాన్ సంస్థలో ఉన్న లోపాలను అనుకూలంగా మార్చుకున్న ఓ ముఠా 800 సెల్‌ఫోన్లను కాజేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. 

‘బూట్ల’తో ప్రారంభమైన దందా...
కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందిన దినేష్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి అమీర్‌పేట్‌లో హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. దినేష్‌ 2017 ఫిబ్రవరిలో అమెజాన్ నుంచి ఓ జత బూట్లను ఆర్డర్‌ ఇచ్చాడు. క్యాష్‌ ఆన్‌ డెలివరీ పద్దతిలో వీటిని బుక్‌ చేసుకోవడంతో రెండు రోజుల్లో డెలివరీ వచ్చింది. ప్యాక్‌ రిసీవ్‌ చేసుకున్న వీరు అమేజాన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఆన్‌లైన్‌ కస్టమర్‌ కేర్‌ డివిజన్‌ను ఆశ్రయించారు. తమకు వచ్చిన పార్శిల్‌లో బూట్లు లేవని, ఖాళీగా ఉందని ఫిర్యాదు చేయడంతో సంస్థ మరో జత బూట్లను పంపింది. అప్పటి నుంచి అదే పంథా కొనసాగిస్తున్న వీరు అమేజాన్‌ సంస్థ కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలపై అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వివిధ చెందిన సెల్‌ఫోన్లు, రూ.5 వేల లోపు ఖరీదు చేసే వాటినే ఎంచుకుని టోకరా వేస్తున్నారు. 

బుక్‌ చెయ్యడం... బుకాయించడం...
పథకం అమలులో భాగంగా వీరు ఓ కొత్త సిమ్‌కార్డును వినియోగించి కొత్తగా ఈ–మెయిల్‌ ఐడీ, బోగస్‌ చిరునామా క్రియేట్‌ చేశారు. వీటి ఆధారంగా అమేజాన్‌ నుంచి ఓ ఫోన్‌ బుక్‌ చేశారు. ఈ పార్శిల్‌ తీసుకున్న వీరు అమెజాన్ కస్టమర్‌ కేర్‌కు తమకు ఖాళీ బాక్సు మాత్రమే వచ్చిందని ఫిర్యాదు చేసి మరో ఫోన్‌ పొందారు. ఇలా వీరు ఏడాదిలో మొత్తం 800 సెల్‌ఫోన్లు క్యాష్‌ ఆన్‌ డెలివరీ కింద బుక్‌ చేసి డెలివరీ బాయ్స్‌కు నగదు చెల్లించి తీసుకుని అదే మొత్తంలో ఫోన్‌లను అదనంగా పొందారు. అమెజాన్ సంస్థ వద్ద సరైన క్రాస్‌ చెకింగ్‌ మెకానిజం లేకపోవడం, రూ.5 వేలు... అంతకు తక్కు వ విలువైన వస్తువుల డెలివరీపై ఆ సంస్థ సరైన దృష్టి పెట్టకపోవడం వీరికి కలిసి వచ్చింది. 

అదే సంఖ్యలోసిమ్‌కార్డులు, చిరునామాలు...  
ఈ నయా మోసానికి తెరలేపిన వీరు ప్రతి లావాదేవీకి ఒక్కోటి చొప్పున మొత్తం 800 ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డులు సమీకరించుకుంది. ప్రతి లావాదేవీ కోసం ప్రత్యేకంగా ఈ–మెయిల్, అమీర్‌పేట కేంద్రంగా ఓ బోగస్‌ చిరునామా సృష్టించారు. సిమ్‌కార్డుల కోసం సోషల్‌మీడియా గ్రూపుల్లో పరిచయమైన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బి.భాను రమేష్, వొడాఫోన్‌ సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఏలూరు వాసి ఎన్‌.లోవా కృష్ణతో పాటు ప్రదీప్‌ సోదరుడు ప్రవీణ్‌రెడ్డిలతో ముఠా ఏర్పాటు చేశారు. వీరి నుంచి ఒక్కో ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డును రూ.50  నుంచి రూ.90 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ఓ దశలో సిమ్‌కార్డులు పొందడం ఇబ్బందిగా మారడంతో కోల్‌కతాకు చెందిన బిపిన్‌ నుంచి వాటిని ఖరీదు చేయడం గమనార్హం.

అమ్మేసి జల్సాలు  
ఇందులో అత్యధిక ఫోన్లను ఈ ముఠా ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అమ్మేసింది. ఖరీదు చేసే వ్యక్తి ఎంతకు బేరమాడినా అంగీకరించి ఇచ్చేసింది. మరికొన్నింటికి అమీర్‌పేట పరిసరాల్లోని సెల్‌ఫోన్‌ దుకాణాల్లో తమకు అమెజాన్ కూపన్స్‌ కింద ఈ ఫోన్‌ వచ్చిందంటూ చెప్పి అమ్మేశారు. ఫోన్లు డెలివరీ తీసుకోవడం, వాటిని విక్రయించడంలో ప్రవీణ్‌ కీలక పాత్ర పోషించాడు.గత మార్చ్‌లో అమెజాన్ సంస్థకు అనుమానం వచ్చింది. దీనిపై సంస్థ ప్రతినిధి అర్జున్‌ అల్లాడి మార్చి 23న గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ కావడంతో డీసీపీ జానకీ షర్మిల నేతృత్వంలో ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ వి.శివకుమార్‌ దర్యాప్తు చేశారు. 

ఐదుగురు నిందితుల అరెస్టు...
ఈ పార్శిల్స్‌ డెలివరీలు అమీర్‌పేట పరిసరా ల్లోనే జరగడంతో పాటు సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ గుర్తించి శుక్రవారం బిపిన్‌ మినహా ఐదుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.10.75 లక్షల నగదు, 556 సిమ్‌ కార్డులు, 42 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఏలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా సిమ్‌ కార్డులను ఇచ్చిన సర్వీసు ప్రొవెడర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement