ఆస్పత్రి వద్ద వాగ్వాదం చేసుకుంటున్న ఇరు వర్గాల వారు
సిద్దిపేటటౌన్: కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచిన సావిలి మీనా మృతదేహాన్ని ఎవరూ తీసుకువెళ్లాలనే విషయంలో ఆస్పత్రి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను గొంతు నులిమిన ఘటనలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో శుక్రవారం ఉదయం మీనా మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇరు కుటుంబాల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని తాము తీసుకువెళ్తామంటే తాము తీసుకువెళ్తామంటూ వాదనకు దిగారు. వీరిని సముదాయించేందుకు బంధువులు చాలా ప్రయత్నించాల్సి వచ్చింది.
మీనా తల్లిదండ్రులు హన్మంతరావుతో పెళ్లి అయిన నాటి నుంచి ఏ అవసరం ఉన్నా తామే చూసుకున్నామని, మధ్యలో డబ్బు కావాలంటే కూడా ఇచ్చామని, ఆ డబ్బు తిరిగి ఇస్తేనే మృతదేహాన్ని అత్తింటికి తీసుకువెళ్లనిస్తామని తేల్చిచెప్పారు.
అయితే మధ్యవర్తులు నచ్చజెప్పడంతో హన్మంతరావు తరపువాళ్లు కొంత వెనక్కి తగ్గి కార్యక్రమాలు అయిన తర్వాత ఇరు వర్గాల వాళ్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో వివాదం కొంత సద్దుమణిగింది. ఆ తర్వాత మరి కొంత సేపటికి తమ బిడ్డను చంపిన వారి ఇంటికి తీసుకువెళ్లనివ్వమని, తమ బిడ్డ చివరి కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తామని చెప్పి మృతదేహాన్ని తల్లి గారి ఊరు అయిన గాడిచర్లపల్లికి తీసుకువెళ్లారు. మార్చురీలో నుంచి మీనా మృతదేహాన్ని తీసుకువస్తున్న క్రమంలో తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో అక్కడి వాతావరణం శోకసంద్రంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment