పోలీసుల అదుపులో నిందితులు
సాక్షి, డోన్(కర్నూల్) : ప్రియుడి హత్య కేసులో ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని డోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కంబగిరి రాముడు తెలిపిన వివరాలు..మండలంలోని ఉంగరానిగుండ్ల గ్రామానికి చెందిన ఖాజావలి అలియాస్ కుంటోడు (38), కృష్ణగిరి మండలం కటారుకొండకు చెందిన బలిజ అనసూయమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని డోన్ పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో కాపురం ఉండేవాడు. అనసూయమ్మ ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుండేది.
ఇంటికి వచ్చిన అమ్మాయిలను ఖాజావలి మద్యం తాగి వేధిస్తుండటం, డబ్బుల కోసం తరచూ గొడవ పడి కొడుతుండటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలో స్థానికులు కమ్మరి సురేంద్రమోహన్, షేక్ ముక్తియార్ అలీతో కలిసి హత్యకు పథకం రచించింది. ఇందులో భాగంగా గత నెల 12న రాత్రి 10 గంటలకు మద్యం తాగేందుకని ఖాజావలిని సురేంద్రమోహన్, షేక్ ముక్తియార్ అలీ బయటకు తీసుకెళ్లారు.
పూటుగా మద్యం తాపి బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు ఈడ్చుకెళ్లి ట్రాక్‌పై పడేశారు. మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న హతుని సోదరుడు హుసేన్‌అలీ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అర్బన్ స్టేషన్‌కు బదిలీ చేయడంతో పది రోజుల క్రితం సురేంద్రమోహన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి డోన్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment