
సైకో రాముడు
కోసిగి: ఉపాధ్యాయుడిని చంపుతానంటూ అగసనూరులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. చివరకు గ్రామస్తులంతా కలిసి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం మేరకు..గ్రామానికి చెందిన రాముడు నిత్యం మద్యం సేవించి అందరినీ బెదిరించేవాడు. చివరకు ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములను కూడా కొడుతుండడంతో వారు గ్రామం విడిచివెళ్లారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం పాఠశాల వదిలిన సమయంలో సైకో పూటుగా మద్యం తాగి పాఠశాల ప్రహరీ బండలను వేటకొడవలితో పగులగొడుతుండగా ఉపాధ్యాయుడు శరత్ అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన రాముడు ఉపాధ్యాయుడి గొంతుపై వేటకొడవలి పెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఉపాధ్యాయుడు అతడి నుంచి తప్పించుకుని వెంటనే తరగతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఉపాధ్యాయుడు గ్రామంలోని యువకులకు ఫోన్ చేయడంతో వారంతా వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసుకున్నట్లు ఏఎస్‌ఐ ఫజిల్‌ఖాన్ తెలిపారు.