
సాక్షి, హైదరాబాద్: పబ్‌జీ గేమ్‌లో ఏర్పడిన పరిచయంతో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి వాట్సాప్ ద్వారా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తెప్పించుకొని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు కథనం ప్రకారం.. నాంపల్లిలో మెకానిక్‌గా పనిచేస్తున్న టోలిచౌకికి చెందిన సల్మాన్ (24)కు, పాతబస్తీకి చెందిన 14 ఏళ్ల విద్యార్థినితో 6 నెలల క్రితం పబ్‌జీ గేమ్ ద్వారా ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారు వాట్సాప్‌లో రోజూ చాటింగ్ చేసుకునేవారు. కొన్ని రోజులు గడిచాక ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఇది నమ్మిన ఆ బాలిక అతడు అడిగినట్టుగా వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను వాట్సాప్‌లో పంపింది.
అయితే గత మూడు నెలలుగా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెస్తానని, మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. తాను ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలని, చెప్పినట్టు వినాలని, డబ్బులు తెచ్చివ్వాలని వేధింపులకు గురిచేసేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. సల్మాన్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలావరకు అమ్మాయిల ఫోన్ నంబర్లను గుర్తించారు. ఈ బాలికను వేధించినట్టుగానే ఇతర అమ్మాయిలను ఎవరినైనా వేధించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment