
సాక్షి, పుణే : అవసరంలేని చోట హడావుడి ఎక్కువ అంటూ పుణే పోలీసులను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు. అందుకు కారణం ఇక్కడ మనం ‘చెప్పు’కోబోయే వ్యవహారమే. తమకు అన్యాయం జరిగిందంటూ ఆశ్రయిస్తే పోలీసులు ఎంత త్వరగతిన స్పందిస్తారో మనకు తెలీదుగానీ... ఇక్కడ ఓ వ్యక్తి ఫిర్యాదు విషయంలో పోలీసులు చేసిన పనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఖేద్ మండలం రక్షవేది గ్రామానికి చెందిన విశాల్ కలేకర్(36) అక్టోబర్ 3న తన చెప్పులు పోయాయంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇంటి బయట విడిచిన చెప్పులు ఎవరో ఎత్తుకెళ్లారని అందులో పేర్కొన్నాడు. ఉదయం 3 నుంచి 8 గంటల మధ్యలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయన అనుమానించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్ జాదవ్ తెలిపారు.
అయితే గతంలో ఇలాంటి ఫిర్యాదులెప్పుడూ తన దృష్టిలోకి రాలేదని.. ఇదే మొదటిసారి అని ఆయన అంటున్నారు. దొంగలెవరో గుర్తించటం కష్టతరంగా మారిందన్న ఆయన సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని కలేకర్‌కు ఇచ్చినట్లు జాదవ్ చెప్పారు. 425 రూపాయల విలువైన చెప్పులను చోరీ చేసిన ఈ కేసులో బాధితుడి ఆవేదనను ఖేద్ పోలీసులు త్వరగా అర్థం చేసుకున్నారంటూ ఓవైపు.. పోలీసులు చేస్తోంది తప్పేం కాదంటూ మరోవైపు ఇలా సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.