
జైపూర్ : రాజస్థాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 24మంది జలసమాధి అయ్యారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి మేజ్ నదిలో పడిపోయింది. బుండీ కోటలాల్ సోట్ సమీపంలోని మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40మంది ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వరుడి కుటుంబం... బంధువులతో కలిసి కోటా నుంచి సవాయ్‌మాధోపూర్ వెళుతోంది. అయితే బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి నదిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు నదిలో పడిపోయినవారిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. కాగా మృతుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించి పూర‍్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment