చోడవరం/కె.కోటపాడు: తమకు న్యాయం చేయండంటూ తమ గోడును చెప్పుకోవడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధితులైన భార్యభర్తలపై ఎ.కోడూరు ఎస్‌ఐ దాడి చేయడం తీవ్ర సంచలనం కలిగించింది. దీంతో దిక్కుతోచని బాధితులు సోమవారం రాత్రి చోడవరం సీఐకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తన భూమిలో పక్క భూమికి చెందిన కైచర్ల వరశివప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా రాళ్లు పాతుతున్నాడంటూ కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామానికి చెందిన పాటూరి సింహాచలం నాయుడు తన భార్య వరలక్షి్మతో కలిసి ఎ.కోడూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ సతీష్ కొద్దిసేపు పక్కన ఉండండని బాధితులకు చెప్పారు.
వీరు స్టేషన్ బయట పక్కనే నిలుచొని ఉండగా కొద్దిసేపటి తర్వాత వీరిని లోపలికి పిలిచి మేము ఖాళీగా ఉన్నామని ఫిర్యాదు చేయడానికి వచ్చారా అంటూ బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సింహాచలం నాయుడిని ఎస్‌ఐ బలవంతాగా లాక్కెళ్లి పిడిగుద్దులు గుద్దడంతో అక్కడే ఉన్న బాధితుడి భార్య వరలక్ష్మి అడ్డుతగిలి తన భర్తను కొట్టవద్దని వేడుకుంది. అయినా వినకుండా ఆమెపై కూడా దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడినట్టు బాధితులు చోడవరం సీఐ ఈశ్వరరావు ముందు వాపోయారు.
తమపై ఎస్‌ఐ దాడి చేశారని, ఇష్టాసారంగా తనను కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పక్క భూమి యజమాని తమను చంపేస్తానని బెదిరిస్తేనే రక్షణ కలి్పంచాలని ఎ.కోడూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లామని అక్కడ రక్షణ కల్పించకపోగా బాధితులమైన తమను ఎస్‌ఐ కొట్టారని బాధితులు సింహాచలం నాయుడు, వరలక్ష్మి విలపించారు. తమపై దౌర్జన్యంగా వ్యవహరించి కొట్టిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని సీఐకి ఫిర్యాదు చేశారు. అలాగే తమ పక్క భూమి యజమాని నుంచి కూడా తమకు రక్షణ కలి్పంచాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎ.కోడూరు ఎస్‌ఐపై ఫిర్యాదు అందింది
కె.కోటపాడు మండలం ఎ.కోడూరు ఎస్‌ఐ దాడిచేశారంటూ సింహాచలం నాయుడు, వరలక్ష్మి అనే భార్యాభర్తలు ఫిర్యాదు చేశారని, దీనిపై విచారణ చేస్తున్నామని చోడవరం సీఐ ఈశ్వరరావు విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment