శంషాబాద్: రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్‌జీఐఏ) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పైలట్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్‌రావు, అదే జిల్లా అద్దంకికి చెందిన లావణ్య లహరి ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వర్‌రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్. లావణ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సీఎస్‌కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్‌రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు.
చచ్చే వరకు ప్రేమించాలనుకున్నా..
భర్త ప్రవర్తన మారడం లేదని, వేరే మహిళతో కలిసి తిరుగుతున్నాడనే ఆవేదనతో లావణ్య సూసైడ్ నోట్ రాసింది. ఓ సెల్ఫీ వీడియోలోనూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ‘ప్రేమించడమంటే చచ్చేవరకు ప్రేమించాలన్న నమ్మకంతో ఇంతకాలం గడిపాను. గృహహింస కేసు పెట్టమన్నారు. కానీ, వాడిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను.. వాడి పాపాలతో వాడే పోతాడు.. కానీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావట్లేదు.. వేరే మహిళతో తిరిగి వస్తున్న వ్యక్తికి సేవలు చేసే దౌర్భాగ్యమేంటి. నా లోపాలను సరిదిద్దుకున్నాను. వాడు మాత్రం తను చేసింది తప్పుగానే గుర్తించట్లేదు. ఇలాంటి వాడికి సేవలు చేసే కర్మేంటి నాకు.. ఇక భరించలేను. ఉండలేననే నిర్ణయం ఈ రోజు తీసుకుంటున్నాను’ అని సెల్ఫ్ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది.
అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త వెంకటేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురిని వెంకటేశ్వర్‌రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment