
బాగ్‌పట్ జైలులో మరణించిన గ్యాంగ్‌స్టర్ బజరంగీ
లక్నో : గ్యాంగ్‌స్టర్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ సోమవారం ఉదయం బాగ్‌పట్ జైల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అదే జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీ బజరంగీని తుపాకితో కాల్చి చంపాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడిలో ఉన్న రాతీ విచారణలో ‘బజరంగీ తనను లావుగా ఉన్నాని హేళన చేశాడని, అందుకే తాను బజరంగీని హత్య చేసినట్లు’ తెలిపాడు.
ఈ విషయం గురించి రాతీ ‘ఆ రోజు నేను మా గదిలో ఎప్పటిలానే నడుస్తూ ఉన్నాను. ఇంతలో బజరంగీ నన్ను దాటుకుని ముందుకు వెళ్లి, నేను చాలా లావుగా ఉన్నానంటూ హేళన చేయడం ప్రారంభించాడు. నేను అతని మాటలను వ్యతిరేకించాను. నన్ను హేళన చేయవద్దని చెప్పాను. అయినా అతను వినలేదు. దాంతో మా మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది.
ఇంతలో బజరంగీ ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. దాంతో నేను అతన్ని కొట్టి అతని చేతిలో నుంచి తుపాకీని లాక్కున్నాను. వెంటనే ఆ తుపాకీలో ఉన్న తుటాలన్నింటిని బజరంగీ తలలోకి దింపేశాను’ అన్నాడు. అనంతరం ఆ తుపాకీని బయట మురుగు కాల్వలో పడేశానని తెలిపాడు.
అయితే రాతీ, బజరంగీ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న మరో ఖైదీ రాతీ వ్యాఖ్యలను ఖండించాడు. అసలు వారిద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగలేదని తెలిపాడు. రాతీ కావాలనే బజరంగీపై దాడి చేశాడని.. కనీసం బజరంగీకి పారిపోయే అవకాశం కూడా దొరకలేదని తెలిపాడు. వీరిద్దరి మాటలను రికార్డు చేసిన పోలీసు అధికారులు ‘బజరంగీని అతని శత్రువులు పథకం ప్రకారమే హత్య చేయించి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఒక కేసు నిమిత్తమై కోర్టులో ప్రవేశపెట్టేందుకు గాను బజరంగీని ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి బాగ్‌పట్ జైలుకు తీసుకువచ్చారుము. కాబట్టి రాత్రికి రాత్రే బజరంగీ ఆయుధాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు అని పోలీసులు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.