సాక్షి, కుప్పం : రాష్ట్రంలో మహిళలపై తెలుగుదేశం నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అలాంటి కీచకపర్వం పునరావృతమైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన భార్యాభర్తలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి కిరాతకంగా ప్రవర్తించారు.
ఈ దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన భార్యాభర్తలకు అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కొంతకాలంగా గొడవలున్నాయి. ఇదే విషయాన్ని ఉమ దంపతులు ఇటీవలి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ కుటుంబం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిందంటూ ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో నిన్న ఉదయం...ఉమ దంపతులు పక్కింట్లోని అవ్వ దగ్గరకు వెళ్తుండగా వారిని చూసిన భాగ్యలక్ష్మి ఉమ్మివేసింది. ఎందుకు ఉమ్మావంటూ ఆ దంపతులు ప్రశ్నించడం నేరమయ్యింది. రెచ్చిపోయిన భాగ్యలక్ష్మి తన బంధువులతో కలసి వారిపై దాడికి తెగబడింది. అంతే కాకుండా జన్మభూమి కార్యక‍్రమంలో తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఉగిపోతూ... ఉమను వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే వివస్త్రను చేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టారు. నోటితో కొరికి దారుణంగా గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చితకబాదారు. స్థానికులు తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతోనే భాగ్యలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. బాధితుడు తమపై జరిగిన దాడి గురించి రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మరోవైపు ఈ దారుణ ఘటనను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాసిల్దార్ వనజాక్షిపై దాడి, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విశాఖ జిల్లాలో దళిత మహిళపై దాడి ఘటనలు సిగ్గుచేటు అని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ...చంద్రబాబుకు బౌన్సర్లుగా మారారన్నారు. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment