మరో శిల్పం కూలకూడదు.. | Three Professors hand In Doctor Shilpa Suicide Case Chittoor | Sakshi
Sakshi News home page

మరో శిల్పం కూలకూడదు..

Published Tue, Nov 13 2018 11:52 AM | Last Updated on Tue, Nov 13 2018 2:45 PM

Three Professors hand In Doctor Shilpa Suicide Case Chittoor - Sakshi

డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసులో.. సిట్‌ ముగ్గురు వైద్యులను దోషులుగా తేల్చడం రాష్ట్రంలోని కీచక వైద్యులకు గుణపాఠమని విశ్లేషకులు వ్యాఖ>్యనిస్తున్నారు. వైద్య విద్యార్థినులను  లైంగిక వేధింపులకు గురిచేస్తే శిక్ష తప్పదన్న విషయాన్ని  ప్రత్యేక దర్యాప్తు బృందం తన నివేదక ద్వారా తెలియజేసిందన్నారు. ముగ్గురు వైద్యులు రాజకీయ పైరవీలు చేసినా సిట్‌ అధికారి ధైర్యంగా నివేదిక వెల్లడించి దోషులకు శిక్ష తప్పదని నిరూపించారు.

చిత్తూరు, తిరుపతి (అలిపిరి): వైద్యరంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని.. కీచక పర్వానికి తనువు చాలించింది. చదువు చెప్పే ఆచార్యులే లైంగికంగా వేధించడంతో  వారిని ఎదరించలేక మౌనంగా అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఆ చదువుల తల్లి ప్రాణాలైతే∙కోల్పోపోయింది గానీ.. ఆ కీచక వైద్యులకు సిట్‌ నివేదిక సరైన గుణపాఠమే నేర్పింది. వైద్య విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసే వారికి డాక్టర్‌ శిల్ప ఉదంతం భయాన్ని నింపింది. శిల్ప మృతిపై విచారణ చేపట్టిన సిట్‌ దర్యాప్తు సంస్థ రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా ముగ్గురు వైద్యులను దోషులుగా పేర్కొంటూ నివేదికను  వెల్లడించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దో షుల పేర్లు ప్రకటించి నెలరోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖ లు చేస్తామని దర్యాప్తు అధికారులు తేల్చారు.

నేపథ్యం ఇదీ..
శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో పిడియాట్రిక్‌ పీజీ ఫైనలియర్‌ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పిడియాట్రిక్‌ విభాగానికి చెందిన వైద్యులు డాక్టర్‌ రవికుమార్, డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌ లైంగిక వేధింపుల కారణంగా వైద్య విద్యార్థిని  ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యపై మూడు నెలల పాటు సాగిన దర్యాప్తులో వైద్యులే దోషులని సిట్‌ తేలింది. అధ్యాపకుల తీరుతో తీవ్ర మానసిక క్షోభను అనుభవించిన డాక్టర్‌ శిల్ప పీలేరులోని తన నివాసంలో ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య తరువాత అందుకు కారకులైన డాక్టర్‌ రవికుమార్‌ను పిడియాట్రిక్‌ హెచ్‌ఓడీ పదవి నుంచి తొలగించారు. మరో ఇద్దరు వైద్యులు డాక్టర్‌ కిరీటీ, డాక్టర్‌ శశికుమార్‌ను నెల్లూరుకు బదిలీ చేశారు. ఎట్టకేలకు సిట్‌ నివేదిక వైద్యులే దోషులని తేల్చడంతో వైద్య విద్యార్థినుల పోరాటానికి భరోసా లభించింది. ఆ తరువాత నిందితులైన ముగ్గురు వైద్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ఆ దుర్మార్గులకు తగిన శిక్ష విధించాలని విద్యార్థినులు, ప్రజలు కోరుతున్నారు.“

మానసిక క్షోభ..
ముగ్గురు వైద్యులు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని బాధితురాలి శిల్ప అప్పట్లో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణయ్య దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. పైగా ప్రిన్సిపాల్‌ దోషులకు అనుకూలంగా వ్యవహరిం చడంతో డాక్టర్‌ శిల్ప మానసిక క్షోభకు గురైంది. వైద్యులను ఎదిరించడంతో వారు ఏం చేస్తారో అన్న భయంతో ముగ్గరు వైద్యులపై డాక్టర్‌ శిల్ప ఏప్రిల్‌ 3న గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్‌ రుయా సీనియర్‌ వైద్య బృందంతో కమిటీ వేసి విచారణ జరిపించాలని హెల్త్‌ వర్సిటీ వీసీని ఆదేశించారు. సీనియర్‌ వైద్య బృందం విచారణ తరువాత తన నివేదికలో ముగ్గురు వైద్యులను ఉత్తములుగా చూపించింది. నివేదిక ప్రభుత్వానికి పంపకముందే అప్పటి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణయ్య దోషులకు అనుకూలంగా ప్రకటన చేశారు. దీంతో శిల్పకు చేదు అనుభవం ఎదురుకాక తప్పలేదు. తర్వాత లైంగిక వేధింపులపై జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను.. కలెక్టర్‌కే అందజేయకుండా నాన్చారు. ఇదే సమయంలో ఫైనలియర్‌ ఫలితాల్లో డాక్టర్‌ శిల్ప ఓ సబ్జెట్‌లో ఫెయిల్‌ కావడం తదితర పరిణామాల నేపథ్యంలో ఇక ఆ ముగ్గురు వైద్యుల నుంచి తప్పించుకునే వీలులేక డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకుంది.

నివేదిక లీక్‌ చేసిన మాజీ ప్రిన్సిపాల్‌ విధుల్లోకి..
డాక్టర్‌ శిల్పపై లైంగిక వేదింపులపై సీనియర్‌ వైద్య బృందం విచారించి నివేదికను అప్పటి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణయ్యకు అందజేసింది. అయితే ఆ నివేదిక ప్రభుత్వానికి అందించకముందే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గు రు వైద్యులకు అనుకూలంగా ప్రిన్సిపల్‌ ప్రకటన చేశారు. అప్పట్లో ప్రిన్సిపాల్‌ వ్యవహారంపై జూడాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య తరువాత సదరు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణయ్యను బాధ్యతల నుంచి తప్పిం చారు. అయితే ఆయనకున్న రాజకీయ పలుకుబడితో ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి మాత్రమే తప్పించేలా మేనేజ్‌ చేసుకున్నారు. కాగా అత్యంత గోప్యంగా నివేదికను ప్రభత్వానికి అందించాల్సిన డాక్టర్‌ రమణయ్య లీకులిచ్చినా ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోకపోడం ఆశ్చర్యం కలిగించే విషయం.

కొండంత భరోసా..
కీచక వైద్యుల బారిన పడే విద్యార్థినులు ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ధైర్యంగా పోరాడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అన్న ధైర్యాన్ని సిట్‌ నివేదిక వెల్లడించింది. కాగా వైద్య కళాశాల్లో డాక్టర్‌ శిల్పలా మరో ఘటన జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం దోషులను వెంటనే శిక్షించి విద్యార్థినులకు భరోసా ఇవ్వాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement