చిచ్చు రాజేసిన టాయ్‌లెట్‌, మత ఘర్షణలు | Toilet clash kills one in UP | Sakshi
Sakshi News home page

చిచ్చు రాజేసిన టాయ్‌లెట్‌, మత ఘర్షణలు

Published Sun, Nov 5 2017 8:27 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

Toilet clash kills one in UP - Sakshi

లక్నో : మరుగుదొడ్డి విషయంలో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకంగా మత ఘర్షణలకు దారితీసి ఉత్తర ప్రదేశ్‌లో ఒకరి ప్రాణాలు బలిగింది. అలీగఢ్‌ జిల్లా, విజయ్‌గఢ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుర్రమ్‌పూర్‌ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఓమ్‌ ప్రకాశ్ శర్మ అనే రైతు 7 ఏళ్ల క్రితం స్థానికంగా కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిలో ఓ మసీదుకు చెందిన టాయ్‌లెట్‌ ఉండటంతో అక్రమంగా నిర్మించారంటూ శర్మ తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆ మరుగుదొడ్డిని తొలగించాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. దీంతో శనివారం ప్రకాశ్ మద్దతుదారులు.. మసీదు నిర్వాహకులు వివాదాస్పద స్థలానికి చేరుకుని వాదించుకున్నారు. ఆ సమయంలో కొందరు మరుగుదొడ్డిని కూల్చేందుకు యత్నించగా.. అది హింసాత్మకంగా మారింది. 

ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆపేందుకు యత్నించిన స్థానికులను చితకబాదినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసులను చూసి రెచ్చిపోయిన ఇరు వర్గాల వారు అక్కడ ఉన్న వాహనాలను తగలబెట్టారు. పరిస్థితి చేజారిపోయిందని భావించిన పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో హసీన్‌ అనే వ్యక్తి ప్రాణాలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. ఓమ్‌ ప్రకాశ్ శర్మతోపాటు గాయపడ్డ అతని సోదరులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 

ఘర్షణ అనంతరం ఉన్నతాధికారులు,  పోలీస్‌ బెటాలియన్‌ ఆ ఊరికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక ఈ ఘర్షణ జరిగిన విధానాన్ని అలీగఢ్‌ జిల్లా కలెక్టర్‌ రిషికేష్‌ భాస్కర్‌ వివరించారు. కొంత కాలం క్రితమే ఇరు వర్గాల ఆ స్థల విషయంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని ఆయన చెప్పారు. అల్లర్లపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉంటే అవతలి వర్గం వాళ్లు మసీదును నాశనం చేశారని మైనార్టీ వర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ లో మసీదు గోడను కూల్చేశారంటూ ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement