పోలీసులు అదుపులో ,నిందితుడు అరుణ్ మంటల్లో దగ్ధమవుతున్న బైక్ , బాధితుడు ఉమాకాంత్
బంజారాహిల్స్: తనకు నమస్తే పెట్టలేదని...తనను గౌరవించడం లేదని... చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడంటూ టీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ నాయకుడు ఓ యువకుడి ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనలో టీఆర్‌ఎస్ రహ్మత్‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వార్డు కమిటీ సభ్యుడు అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి, బాధితుడు పి.ఉమాకాంత్ తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్ సమీపంలో నివసించే ఉమాకాంత్(20) శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో సోమాజిగూడలోని తన పాన్‌షాప్‌ను మూసేసి రహ్మత్‌నగర్ నల్లపోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే తన స్నేహితుడు రాహుల్ ఇంటికి వచ్చి బైక్‌ను పార్కింగ్ చేశాడు.
అదే సమయంలో స్థానిక టీఆర్‌ఎస్ నేత అరుణ్ ఆ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఉమాకాంత్ తనకు నమస్తే పెట్టకుండానే తనను పలకరించకుండా వెళ్ళడమే కాకుండా ఆ ప్రాంతానికి ఎవరెవరినో తీసుకొస్తున్నాడని అరుణ్ కోపం పెంచుకున్నాడు. అదే సమయంలో అరుణ్ కర్ర తీసుకొని కొట్టడానికి వస్తున్నాడంటూ రాహుల్ చెప్పడంతో ఉమాకాంత్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఉమాకాంత్ తన స్నేహితుడైన దుర్గకు సమాచారం ఇచ్చాడు. కొద్ది సేపటికే అరుణ్ తన వాహనంలో ఉన్న పెట్రోల్‌ను సీసాలో నింపి ఉమాకాంత్ బైక్(టీఎస్ 09 ఈడబ్లు 5219)పై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో అక్కడికి ఉమాకాంత్, దుర్గ ఇద్దరూ చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అరుణ్ దుర్గను తన్నాడు. అరుణ్ సోదరుడు అనిల్, మహేష్‌లు అక్కడికి చేరుకొని దుర్భాషలాడారు.
కర్రతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఇలా ఉండగా గొడవ జరుగుతున్న సమయంలో అదే దారిలో వెళ్తున్న రౌడీషీటర్ బిల్లా పవన్ గమనించి వెంటనే రహ్మత్‌నగర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఉన్న కానిస్టేబుల్ బాలకృష్ణకు సమాచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న అదే సెక్టార్ ఎస్‌ఐ శేఖర్ అప్రమత్తమై అక్కడి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని అందరినీ అవుట్‌పోస్టుకు తరలించారు. అయితే పోలీసుల సమక్షంలోనే అరుణ్‌తో పాటు ఆయన సోదరుడు అనిల్, మహేష్‌లు బండబూతులకు దిగారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలన్నీ అర్ధరాత్రి సోషల్‌మీడియాలో వైరల్ కాగా అర్ధరాత్రి భయానక వాతావరణం నెలకొంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా ఉధ్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై దూకుడు, అసభ్యకరపదజాలం సైతం వీడియోల ద్వారా బయటకు పొక్కింది.
దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు ఘటనపై విచారణ చేపట్టారు. తనపై అరుణ్ కత్తితో దాడి చేసి చంపుతానని బెదిరించాడని ఆయన సోదరుడు అనిల్, మహేష్‌లు బెదిరించారంటూ ఉమాకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 435, 323, 506, రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. అరుణ్‌ను అరెస్ట్ చేశారు. మిగిలినవారి ప్రమేయం ఎంత వరకు ఉన్నదానిపై విచారణ చేపడుతున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌కె. బాలకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పోలీసు విధులకు ఆటంకపరిచిన ఘటనపై కూడాదృష్టిసారిస్తామన్నారు. ఈ ఘటనతో స్థానికంగా పోలీసులు పెట్రోలింగ్ పెంచి పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment