
బోయిని ఆంజనేయులు
మేడ్చల్/శామీర్‌పేట్: చేతబడి అనుమానమే ఓ అమాయకుడిని బలిగొంది.. ఆ మూఢనమ్మకమే ఆ యువకుడిని సజీవ దహనం చేసింది.. బతికుండగానే చితిలో పడేసి కాల్చేసేలా పురిగొల్పింది.. మానవత్వాన్ని మంటల్లో కాల్చేసిన ఈ ఘటన.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది.
అటుగా వెళ్లడమే పాపమైంది..
అద్రాస్‌పల్లికి చెందిన గ్యారలక్ష్మి (45)అనే మహిళ గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. గ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతబడి చేయడంతోనే లక్ష్మి చని పోయిందని బంధువులు అనుమానించారు. అదే నిజమైతే చేతబడి చేసిన వారు.. చితి కాలిపోయే లోపు అక్కడికి వస్తారనే నమ్మకంతో.. రాత్రి లక్ష్మి బంధువులు బలరాం, కిష్టయ్య లు చితికి సమీపంలోనే కాపు కాస్తూ ఉన్నారు. అదే సమయంలో శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కెనాల్ కాలువ వద్దకు అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (29) రోజూ మాదిరిగానే రాత్రి 8.30 గంటలకు బహిరంగ మలవిసర్జన కోసం రావడంతో అతడిని అనుమానించారు. ఆంజనేయులు తండ్రి కిష్టయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం ఉండటంతో వారి అనుమానం బలపడింది.
నగ్నంగా.. చితిలోకి నెట్టేసి..
ఆంజనేయులును గమనించిన బలరాం, కిష్టయ్యలు వెంటనే అతడిపై రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత ఆంజనేయులు శరీరంపై ఉన్న దుస్తులు తీసేసి.. కాలుతున్న లక్ష్మి చితిలో అతడిని పడేశారు. దీంతో అతడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ విషయం ఊరంతా పాకడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో శామీర్ పేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు గ్యార బలరాం, గ్యార కిష్టయ్య, గ్యార నర్సింహతోపాటు మరో వ్యక్తి బండల శ్రీరాములును గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి, అంజనేయులు అస్థికలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఆ కుటుంబం ఏకాకి..
పదో తరగతి వరకు చదువుకున్న ఆంజనేయులు కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కిష్టయ్య క్షుద్రపూజలు చేస్తాడని ఆరోపణలు ఉండటంతో గ్రామస్తులంతా ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతేడాది కిష్టయ్య చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవరూ వెళ్లలేదు.
అన్ని కోణాల్లో దర్యాప్తు: పద్మజారెడ్డి
ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామంలోని రెండువర్గాల వారు వేర్వేరు వాదనలు వినిపించారు. క్షుద్రపూజల నెపంతోనే అంజనేయులును చితిలో పడేశారా లేదా అనేది తెలుసుకుంటున్నాం. చితిలో నుంచి అస్తికలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. నివేదిక వచ్చిన తర్వాత కొంత స్పష్టత వస్తుంది. ఘటనాస్థలి వద్ద రక్తపు మరకలు, చేతి రుమాలు లభ్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment