రాజమహేంద్రవరం క్రైం: అష్టా చెమ్మా ఆటలో యువకుల మధ్య నెలకొన్న వివాదం ఓ మహిళ మృతికి కారణమయ్యింది. తన కొడుకుపై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను మరో వర్గం వారు పోలీస్ స్టేషన్ ఎదుటే కొట్టి చంపారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. ఈ మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు అక్కడే ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెడ్డీలపేటకు చెందిన వల్లెపు శేఖర్, అదే ప్రాంతానికి చెందిన వేముల ఆంజనేయులు అనే యువకులు శనివారం అష్టా చెమ్మా ఆట ఆడుతూ డబ్బుల కోసం గొడవ పడ్డారు. శేఖర్‌పై ఆంజనేయులు దాడి చేశాడు.
శేఖర్ తల్లి వల్లెపు బుజ్జమ్మ (35) పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అప్పుడు ఆంజనేయులు కుటుంబీకులు వచ్చి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ పోలీస్ స్టేషన్ చివరకు తీసుకువెళ్లి సొమ్మసిల్లేలా కొట్టారు. దాడి జరుగుతున్న సమయంలో కానిస్టేబుల్ అక్కడే ఉన్నా అడ్డుకోలేదని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బుజ్జమ్మను ఆమె కుమారుడు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతో‹Ù బాధితులతో చర్చించి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment