సాక్షి, ధర్మవరం: వైఎస్ఆర్ సీపీకి చెందిన క్రియాశీలక నేత చెన్నారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం చెన్నారెడ్డిని వేట కొడవళ్లతో నరికి హత్యచేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బడనపల్లి వైఎస్ఆర్ సీపీలో చెన్నారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ సీపీతోనే కొనసాగుతున్న చెన్నారెడ్డి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తుండటాన్ని రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో చెన్నారెడ్డి హత్యకు పథకం పన్నారు.
ఈ క్రమంలోనే బుధవారం ఉదయం బడనపల్లి సమీపంలోని పంట పొలాల వద్ద పనులు పర్యవేక్షిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో చెన్నారెడ్డిపై దాడి చేసి హత్యచేశారు. విషయం తెలుసుకున్న చెన్నారెడ్డి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు జరిగినా, వారిని హత్య చేస్తున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలున్నా ఏపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదు. హత్య చేసినా ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసుల కేసులు నమోదు చేయరని, ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్‌సీపీ నేత దారుణహత్య చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తుండగా.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు హత్యా రాజకీయాలకు తెరతీయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment