
విద్యాప్రచారం కోసం భారత సంతతి బాలిక
వాషింగ్టన్: అమెరికాలో విద్యా ప్రచారం కోసం భారత సంతతి బాలిక శ్వేతాప్రభాకరన్ ఎంపికయ్యారు. ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ఏర్పాటు చేసిన ‘బెటర్ మేక్ రూమ్’కు అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా శ్వేత సేవలందిస్తారు. బెటర్ మేక్ రూమ్ అనే సంస్థ యువతను ఇంజనీరింగ్ విద్యవైపు మళ్లించేందుకు కృషిచేస్తోంది. మొత్తం 17 మందిని ఇందుకోసం ఎంపికచేయగా అందులో శ్వేత ఒకరు. ఇందులో 12 మంది హైస్కూల్ విద్యార్థులు ఉంటే, ఐదుగురు కాలేజీ విద్యార్థులు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లక్ష్యాలను నేరవెర్చేందుకుగాను బెటర్ మేక్ రూమ్ అనే సంస్థను మిచెల్ బబామా స్థాపించారు. అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి కృషి చేస్తూనే యువ ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. శ్వేత తల్లిదండ్రులు తమిళనాడులోని తిరునవెళ్లికి చెందినవారు. 1998లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. బెటర్ మేక్ రూమ్ స్టూడెంట్ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉందని శ్వేత అన్నారు. భరతనాట్యంలో 2015 సంవత్సరానికిగాను వైట్‌హౌజ్ నుంచి బహుమతి కూడా గెలుచుకున్నారు శ్వేత. అంతేకాదు ఇంటర్నేషనల్ లిటరసీ అసోసియేషన్–2016కు కూడా ఎంపికయ్యారు.