సౌదీ అరేబియాలో చిక్కిన అబిదీన్
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నిందితుడు
♦ ఎక్స్‌ప్లోజివ్ మాడ్యూల్‌లో కీలక పాత్రధారి
♦ మరో నిందితుడు అబు సూఫియాన్ సైతం అదుపులోకి..
♦ ఇరువురినీ భారత్‌కు రప్పించేందుకు ఎమ్‌హెచ్‌ఏ యత్నం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో మరో కీలక నిందితుడు జైనుల్ అబిదీన్ సౌదీ అరేబియాలో చిక్కాడు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్ ఇస్మాయిల్ అఫాఖీకి అబిదీన్ ప్రధాన అనుచరుడు.
అఫాఖీ ద్వారా రియాజ్‌తో సంబంధాలు...
హైదరాబాద్‌ను 2007 తరవాత మరోసారి టార్గెట్ చేయాలని ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ 2012లోనే పథకం వేశాడు. ఆ మేరకు సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ అలి యాస్ హడ్డీ, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లను కర్ణాటకలోని మంగుళూరుకు పంపి చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపా డు. అబిదీన్ సైతం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందినవాడే. అదే ప్రాంతానికి చెందిన, బెంగళూరులో హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ ద్వారా పాకిస్తాన్‌లో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా హడ్డీని సంప్రదించిన రియాజ్ ‘టార్గెట్ హైదరాబాద్’ విషయం చెప్పాడు. దీనికి అవసరమైన పేలుడు పదార్థాలు అందించే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు.
ఎక్స్‌ప్లోజివ్స్ బాధ్యతలు అఫాఖీకి...
రియాజ్ భత్కల్ 2009 నుంచి పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి పేలుళ్లకు అవసరమైన ఎక్స్‌ప్లోజివ్ (అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ) సమీకరించే బాధ్యతల్ని అఫాఖీకి అప్పగించాడు. ఇతడినే ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్ చీఫ్‌గా మార్చాడు. అఫాఖీ 2005లో పాకిస్తాన్ కరాచీకి చెందిన అర్సాలా అబీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అఫాఖీని ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో రియాజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అనుమానం రాకుండా ‘మీన్ తూటా’లతో
ఎక్స్‌ప్లోజివ్స్ సమీకరణకు కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే ‘మీన్ తూటా’లను అఫాఖీ ఎంచుకున్నాడు. ఎక్స్‌ప్లోజివ్‌ను జాగ్రత్తలతో సముద్రంలో పేల్చడం ద్వారా చేపలు పట్టే విధానాన్ని అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు.
సద్దాం, అబిదీన్‌ల ద్వారా సమీకరణ...
పేలుడు పదార్థం సేకరించే బాధ్యతల్ని భత్కల్‌కే చెందిన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌తో పాటు అబిదీన్ మరికొందరికి అప్పగించాడు. ఇలా ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించి తయారు చేసిన బాంబుల్నే ఉగ్రవాదులు దిల్‌సుఖ్‌నగర్ సహా అనేక చోట్ల పేల్చారు. 2013 హైదరాబాద్ పేలుడు తరవాత సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. ఐఎం ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్‌గా ఉన్న అఫాఖీతో పాటు సద్దాం తదితరుల్ని బెంగళూరు పోలీసులు ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే అబిదీన్ పాత్ర వెలుగులోకి వచ్చింది.
విచారణలో వెలుగులోకి....
అబిదీన్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకున్న నిఘా వర్గాలు పాస్‌పోర్ట్ నంబర్ ఆధారంగా అక్కడి ఏజెన్సీలను అప్రతమత్తం చేశాయి. దీంతో ఇటీవల అబిదీన్‌ను అదుపులోకి తీసుకున్న అక్కడి ఏజెన్సీలు ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)కు సమాచారం ఇచ్చాయి. నేరస్తుల మార్పిడి ఒప్పందం ప్రకారం అబిదీన్‌ను సౌదీ నుంచి తీసుకురావడానికి ఎంహెచ్‌ఏ సన్నాహాలు చేస్తోంది.
నగరవాసి అసద్ ఖాన్ సైతం...
సౌదీ అరేబియాకు చెందిన ఏజెన్సీలు ఐఎం ఉగ్రవాది అబిదీన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) సానుభూతిపరుడు అసద్ ఖాన్ అలియాస్ అసదుల్లా ఖాన్ అలియాస్ అబు సూఫియాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. నగరంలోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన సూఫియాన్ బెంగళూరుకు చెందిన హుజీ కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు. రియాద్ కేంద్రంగా కుట్ర చేసిన ముష్కరులు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, హుబ్లీ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ప్రముఖుల్ని ఏకకాలంలో హత్య చేయడానికి కుట్రపన్నారు. దీన్ని 2012లో ఛేదించిన బెంగళూరు పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు.
వీరిలో పాతబస్తీకి చెందిన ఒబేదుర్ రెహ్మాన్ కూడా ఒకడు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో వాంటెడ్‌గా ఉన్న నిందితుల్లో అబు సూఫియాన్‌తో పాటు హైదరాబాద్‌కే చెందిన మరో ఐదుగురు సైతం ఉన్నారు. వీరి అరెస్టుకు సహకరించాల్సిందిగా ఎంహెచ్‌ఏ కోరిన నేపథ్యంలోనే సౌదీ ఏజెన్సీలు అబిదీన్‌తో పాటు సూఫియాన్‌ను పట్టుకున్నాయి. హత్యల కుట్ర అమలుకు అవసరమైన ఆర్థిక, నైతిక సహకారం అందించడంలో సూఫియాన్ పాత్ర ఉన్నట్లు ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది.