కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాయలసీమకు ప్రతి విషయంలోనూ అన్యాయమే జరిగిందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాయలసీమలో సహ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు కుట్రలు,కుతంత్రాల వల్ల ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎందరో మహానుభావులు పుట్టినిల్లకు నిలయంగా మారిన ఈ ప్రాంతం తాగు,సాగు నీటి ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పూర్తి చేయడం లేదన్నారు..శ్రీశైలం నీటిని విద్యుత్ పేరుతో 854 కనీస అడుగుల నీటి మట్టాన్ని నిల్వ చేయకుండా ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు రాయలసీమకు కాకుండా నీటిని తీసుకెళ్లడం దారుణమన్నారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న చంద్రబాబు ఇంతవరకు నీరు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. శ్రీ బాగ్ ఒడంబడిక నుంచి నేటి విభజన చట్టంలో కూడా రాయలసీమకు అన్యాయం జరగడం బాధాకరమన్నారు.సీమలోని సమస్యలు పరిష్కరించేందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. త్వరలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరపున కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, లింగమూర్తి, బీసీ సంఘ నాయకులు అవ్వారు మల్లికార్జున, జేవీ రమణ.సంఘ సేవకులు సలావుద్దీన్ ,మగ్బూల్ బాషా తదితరులు పాల్గొన్నారు.