మరుగుదొడ్ల నిర్మాణంలో అంబాజీపేట అథమం
మరుగుదొడ్ల నిర్మాణంలో అంబాజీపేట అథమం
Published Thu, Jan 19 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్
నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు
అంబాజీపేట (పి.గన్నవరం) : వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్‌ఎల్) నిర్మాణంలో అంబాజీపేట మండలం జిల్లాలోనే అథమ స్థానంలో ఉందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని, గంగలకుర్రు అగ్రహారం అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మండలంలోని 11 గ్రామాల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క గ్రామంలో కూడా నూరు శాతం నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. ప్రజాప్రతినిధులకంటే అధికారుల నిర్లక్ష్యమే అధికంగా కనబడుతోందన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు 530కి గానూ ఇప్పటికే 270 గ్రామాల్లో నూరు శాతం ఐఎస్‌ఎల్ నిర్మించామని వివరించారు. ఈ 270 గ్రామాల్లో అంబాజీపేట మండలం నుంచి ఒక్క గ్రామం కూడా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 830 అంగన్‌వాడీ కేంద్రాలకు 100 భవనాల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మార్చి నెలాఖరుకు లక్ష్యం చేరుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఐఎస్‌ఎల్ నిర్మించుకున్నవారికి తక్షణమే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది బిల్లులు ఆన్‌లైన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందువల్లే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని వివరించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఐఎస్‌ఎల్ నిర్మాణాల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో లేరని, కేవలం సెలవు చీటీ టేబుల్‌పై ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, సర్పంచ్ మట్టపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement