
'ఆయనకు ఫిరాయింపులే ప్రియం'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో చూపించే శ్రద్ధ పాలనా వ్యవహారాల్లో లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో చూపించే శ్రద్ధ పాలనా వ్యవహారాల్లో లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. బుధవారం కొత్త టీచర్ల నియామకం సందర్భంగా ప్రతిజ్ఞా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి ఓ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కార్యక్రమానికి వెళ్లారు.
ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ ఫిరాయింపు సందర్భంగా కండువా కప్పడానికి.. 8,926 మంది నవ ఉపాధ్యాయులను చంద్రబాబు కార్యక్రమం మధ్యలో వదిలేసి వెళ్లారు. దీంతో చేసేదేంలేక అధికారులు చంద్రబాబు వచ్చేంత వరకు టీచర్లను వెయిట్ చేయించారు. ముఖ్యమంత్రి చర్యతో అధికారులతో పాటు ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న టీచర్లలో స్పూర్తిని నింపాల్సిన కార్యక్రమంలో సాక్షాత్తూ.. ముఖ్యమంత్రే ఇలా దిగజారుడుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి.