కెమరూన్ దేశస్తుల ‘బ్లాక్’ వ్యూహం
- విద్యార్థుల ముసుగులో ఘరానా మోసం
- నోట్లను డాలర్లుగా మారుస్తామని బురిడీ
- పాస్‌పోర్టు లేకుండా తిరుగుతున్న నల్లజాతీయుడు
- పక్కా సమాచారంతో అదుపులోకి..
నంద్యాల: విద్యార్థుల ముసుగులో దొంగ నోట్ల తయారీ పేరిట ఘరానా మోసం చేస్తున్న ఆఫ్రికాలోని కెమరూన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ హరినాథరెడ్డి స్థానిక పోలీస్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కెమరూన్ దేశానికి చెందిన 37 ఏళ్ల రోబర్ట్ విద్యార్థి వీసా సంపాదించి ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు చేరుకున్నాడు. ఇక జాన్సన్ దవే ఎలాంటి పాస్‌పోర్టు లేకుండానే ఇండియాలోకి ప్రవేశించి బెంగళూరులోని కెంపెగౌడ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇండియన్ అకాడమీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నట్లు గుర్తింపు కార్డును సృష్టించుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ దొంగనోట్ల తయారీ పేరిట అమాయకులకు ఎరవేసి డబ్బు లాగడం ప్రారంభించారు. ఆళ్లగడ్డకు చెందిన ఫైనాన్షియర్ లక్ష్మీనారాయణ, బెంగళూరులో బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసిన మహేష్ స్నేహితులు. మహేష్‌కు కెమరూన్ గ్యాంగ్‌తో పరిచయం ఉంది. వీరిని లక్ష్మీనారాయణకు పరిచయం చేశాడు. ఆర్‌బీఐ జారీ చేసిన రూ.2వేల నోట్లను తయారు చేసిస్తామని కెమరూన్ గ్యాంగ్ ఆయనను మభ్యపెట్టింది.
నంద్యాల కేంద్రంగా...
నంద్యాల కేంద్రంగా కెమరూన్ గ్యాంగ్ నోట్ల తయారీ మోసానికి సిద్ధమైంది. స్థానిక శ్రీనివాస సెంటర్‌లోని ఓ లాడ్జిలో కెమరూన్ గ్యాంగ్, మహేష్ మకాం వేశారు. లక్ష్మీనారాయణ రూ.8లక్షల రూ.2వేల నోట్ల కట్టలను ఆళ్లగడ్డకు చెందిన రాజీవ్ ద్వారా పంపారు. ఈ గ్యాంగ్ నోట్ల కట్టలను తయారు చేస్తామని మభ్యపెడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్‌ఐ నవీన్ లాడ్జిపై దాడి చేసి కెమరూన్ దేశస్తులు జాన్సన్, రోబర్ట్‌లను అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబ్ క్లిప్పింగ్ ఆధారంగా వ్యూహం
యూట్యూబ్‌లో వచ్చిన వీడియో ఆధారంగా కెమరూన్ గ్యాంగ్ నకిలీ నోట్ల తయారీ పేరిట ఘరానా మోసానికి వ్యూహం పన్నింది. రూ.లక్ష ఇస్తే, తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూ.3లక్షల అమెరికన్ డాలర్లను తయారు చేసి ఇస్తామని మభ్యపెట్టారు. రూ.2వేల నోట్ల కట్టలకు విదేశాల నుంచి తెచ్చిన పౌడర్‌ను కలిపి, వాటిపై బరువు పెట్టి 30 గంటలు గాలి సోకకుండా భద్రపరుస్తామని, తర్వాత ఈ పౌడర్‌కు రసాయనాలను కలిపి బ్లాక్ నోట్లపై పూస్తే అమెరికా డాలర్లు తయారు అవుతాయని మభ్యపెట్టారు. చేతికి డబ్బు అందగానే పరారు కావాలనేది వీరి వ్యూహం. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ రూ.8లక్షలు అందజేయడం.. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో వ్యవహారం బట్టబయలయింది. లాడ్జిపై దాడి చేసిన పోలీసులు 20 కట్టల బ్లాక్ కోటెడ్ కరెన్సీ బండిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు, కెమికల్ బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు ఆదేశించారు.
మూలాలకై ఆరా..
కెమరూన్ దేశానికి చెందిన నల్లజాతీయులు సరైన పాస్‌పోర్టులు లేకుండా ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో నిర్భయంగా తిరగడంపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం సబ్‌జైలులో ఉన్న వీరిని రెండు మూడు రోజుల్లో జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో నైజీరియా, కెమరూన్ ప్రాంతానికి చెందిన నల్లజాతీయులు డ్రగ్స్, మారణాధాయాల అమ్మకాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. దీంతో రోబర్ట్, జాన్సన్‌ల వెనుక నేర చరిత్ర ఉందేమోననే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం రోబర్ట్ వద్ద మాత్రమే 2020 వరకు గడువున్నా పాస్‌పోర్టు ఉంది. ఇది అసలైనదా.. నకిలీదా అనే విషయమై విచారిస్తున్నారు. ఇందుకోసం పాస్‌పోర్టును సీజ్ చేశారు.