కేసీఆర్, హరీశ్ మధ్య కోల్డ్వార్
తొగుట(మెదక్): మల్లన్న సాగర్ నిర్మాణంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందనీ, అందుకే వేర్వేరు ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు బాధితులకు మద్దతుగా సీపీఎం చేపట్టిన పాదయాత్ర శనివారం మెదక్ జిల్లా వేములగాట్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని ప్రకటిస్తే, మంత్రి హరీశ్ 123 జీవో ప్రకారం చెల్లిస్తామంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అంతర్గత పోరు మొదలైందనీ, సీఎం కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకే మంత్రి హరీశ్ మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. 50 టీఎంసీల నిల్వ ఉండే మల్లన్నసాగర్ నిర్మాణానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం తగ్గించి ముంపు భారీ నుంచి గ్రామాలను కాపాడాలన్నారు. ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 5 లక్షల ఎకరాల సాగు భూమిని దౌర్జన్యంగా లాక్కుంటోందని ఆరోపించారు. ఈ భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు.