వాణిజ్య పన్నులశాఖ అక్రమ దాడులను ఆపాలి
కడప రూరల్ : వాణిజ్య పన్నులశాఖ అక్రమ దాడులను ఆపాలని వివిధ అసోసియేషన్ల నేతలు డిమాండ్ చేశారు. అందుకు నిరసనగా మంగళవారం కడప నగరంలో వాణిజ్య సముదాయాలను బంద్ చేపట్టారు. అంతకుముందు మండీల బజారులో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నిసార్‌జాన్ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తార్, శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వింతపోకడలు అవలంభిస్తోందని దుయ్యబట్టారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా అధికారులను ఉసి గొల్పడం తగదన్నారు. ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షడు నిసార్‌జాన్, జంషీర్, యూసుఫ్, జనార్దన్ మాట్లాడుతూ వాణిజ్య పన్నులశాఖ అక్రమంగా దాడులకు పాల్పడటమే కాకుండా రూ. లక్షల్లో జరిమానాలు విధించడం దారుణమన్నారు. అనంతరం అక్కడి నుంచి బంద్ పర్యవేక్షణకు ర్యాలీగా పాత కూరగాయల మార్కెట్, బీకేఎం వీధి, వైవీ స్ట్రీట్, ఎస్‌ఎఫ్‌ఎస్ స్ట్రీట్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు బాదులాల, వివిధ అసోసియేషన్ల నాయకులు జిలానీ, పెద్ద సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు.