యనమలా..నాటి లేఖల మాటేమిటి?
ఆర్థిక మంత్రికి కాంట్రాక్టు అధ్యాపకుల ప్రశ్న
భానుగుడి(కాకినాడ) : అధికారం లేనపుడు ఒకలా.. అధికారం చేతికొచ్చాక మరోలా..రంగులు మార్చే ఊసరవెల్లిలా యనమల ప్రవర్తన ఉండడం దురదృష్టకరమని కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ పేర్కొంది. సోమవారం పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ యరమాటి రాజాచౌదరి మాట్లాడుతూ అధికారంలో లేనపుడు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి తమ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెగ్యులరైజేషన్ విçషయమై లేఖలు రాసి, ఎన్నికల సమయంలో హామీలిచ్చి, అధికారంలోకొచ్చాక తమ గురించి పట్టించుకోకుండా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వేలమంది అరకొర వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిన కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని కాంట్రాక్టు› లెక్చరర్లు వాపోయారు. ఈ సందర్భంగా యనమల చిత్రపటానికి మోకాళ్లపై మొక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నేడు కలెక్టరేట్ ఎదుట భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొంటున్నారని, పలువురు వామపక్ష నాయకులు తమకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు.