
నిప్పురవ్వలు ఎగిసి.. పది ఇళ్లలో పేలుళ్లు
నెల్లూరు జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.
- నెల్లూరు జిల్లాలో విషాదం
- బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
నెల్లూరు: నెల్లూరు జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగర శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణసంచా పదార్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతిచెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగాస నిప్పు రవ్వలు ఎగిరిపడి.. బాణాసంచాకు అంటుకోవడంతో వరుసగా 10 ఇళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఉదయం 9.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు ఘటనపై ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే కోటంరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ తదితరులు పరామర్శించారు.
బాణాసంచా తయారీదారుల్లో చాలామంది వద్ద లైసెన్సులు లేవని తెలుస్తోంది. వరుసగా బాణాసంచా పేలుళ్ల ఇక్కడ జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు.