పెళ్లి అనగానే మాట మార్చాడు..! | Girl Protest In Front of Boyfriend House | Sakshi
Sakshi News home page

పెళ్లి అనగానే మాట మార్చాడు..!

Published Wed, Aug 17 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

గాజువాక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన బాధితురాలు (ఇన్ సెట్- దుర్గారెడ్డి)

గాజువాక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన బాధితురాలు (ఇన్ సెట్- దుర్గారెడ్డి)

విశాఖపట్నం: ప్రేమికుడి మాయ మాటలు నమ్మి మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతోంది. మోసానికి పాల్పడిన వంచకుడు మాత్రం మరో యువతితో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ప్రేమించానని మోసం చేసిన వ్యక్తితోనే తన పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరుతూ ఆ యువతి గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద బంధువులతో కలిసి మంగళవారం ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే...

స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఒక మహిళ కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తె (21)ని డిగ్రీ వరకు చదివించింది. సమీప బంధువు, ఆటో డ్రైవర్ చిల్ల దుర్గారెడ్డి ప్రేమిస్తున్నానని నమ్మించి స్వాతికి దగ్గరయ్యాడు. మాయమాటలతో లోబరుచుకోవడంతో యువతి గర్భం దాల్చింది. ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని దుర్గారెడ్డిపై ఒత్తిడి తెచ్చింది. సరేనని చెప్పిన దుర్గారెడ్డి బలం మాత్రల పేరుతో అబార్షన్ మాత్రలను ఇచ్చాడు.

వాటిని వినియోగించడంతో స్వాతికి తీవ్ర కడుపునొప్పి, ఆ తర్వాత రక్తస్రావమయింది. అనంతరం గత నెల 29న తెల్లవారి 3 గంటలకు బాత్రూమ్‌కు వెళ్లిన స్వాతి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ విషయం కుటుంబ సభ్యులతో చెప్పకుండా తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లిని, సోదరుడిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది. తర్వాత ఇంటికి తిరిగొచ్చిన స్వాతి సోదరుడు బాత్‌రూమ్‌లో ఆడ శిశువును చూసి నగరంలోని కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ శిశువు మృతి చెందింది. దీంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది.
 
వివాహం చేసుకుంటానని మోసం
ఆ సమయంలో తల్లిదండ్రులతో ఆస్పత్రికి వచ్చి యువతిని పరామర్శించిన దుర్గారెడ్డి ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. సాయంత్రానికి తిరిగి వస్తానన్న వ్యక్తి ఫోన్ చేసి వివాహం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు.

దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మృత శిశువుతో చిల్లపేట వెళ్లినప్పటికీ మోసగాడి ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో బాధితురాలు మృత శిశువుతోనే ఆందోళనకు దిగింది. దీంతో అక్కడి పెద్దలు లక్ష రూపాయలు తీసుకుని విషయాన్ని మరిచిపోవాలని స్వాతికి సూచించారు. ఇక అక్కడ న్యాయం జరగదని భావించిన బాధితురాలు గాజువాక పోలీసులను ఈ నెల 1న ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పేరుతో రెండు వారాలుగా కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ నెల 18న మరో యువతితో దుర్గారెడ్డికి వివాహం జరగనుండటంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. ఫిర్యాదు ఇచ్చినప్పుడు విచారణ కోసం వచ్చిన మోసగాడిని కూడా పోలీసులు విడిచి పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు మాత్రం దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఎప్పటి మాదిరిగానే హామీ ఇచ్చి బాధితురాలిని పంపించేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ అప్పలరాజును సంప్రదించగా నిందితుడిని పట్టుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాము వెళ్లిన ప్రతిసారీ నిందితుడు పరారవుతున్నాడని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement