డీఎస్పీపై విచారణ చేపట్టాల్సిందే!
* రాజకీయ పార్టీ నేతలు, ప్రజా, కులసంఘాల సమావేశం డిమాండ్
* మాజీ ఎమ్మెల్యే జంగాపై దాడికి ఖండన
* చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
గుంటూరు (పట్నంబజారు) : మాజీ ఎమ్మెల్యే, బడుగు, బలహీన వర్గాల నేత జంగా కృష్ణమూర్తి యాదవ్‌పై గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేసి, చేయి చేసుకోవడంపై శాఖాపరమైన విచారణ జరిపించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మద్దుల కోటయ్యయాదవ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని ప్రజా, కుల సంఘాలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్రాడీపేటలోని సింధూరి హోటల్‌లో రాజకీయ పార్టీల నేతలు, ప్రజా, కుల సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావును సస్పెండ్ చేయాలని, జంగాకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోటయ్య యాదవ్ మాట్లాడుతూ వారంలో రోజుల్లో తమ డిమాండ్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. సామాజిక న్యాయం రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది వైకే, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, మాలమహానాడు జిల్లా అ«ధ్యక్షుడు కొర్రపాటి చెన్నకేశవులు, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు తాటికొండ నరసింహారావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పీవీ రమణయ్య మాట్లాడుతూ అధికార మదంతో బడుగు, బలహీన వర్గాలపై అహంకారపూరితంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులు చేస్తే రాబోవు రోజుల్లో తమ సత్తా చాటుతామని స్పష్టం చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోలీసులను పచ్చచొక్కా కార్యకర్తల్లా మార్చుకొని దాడులు చే యిస్తున్నారని ధ్వజమెత్తారు.