వారి పోస్టుమార్టం నివేదికలను ఎయిమ్స్‌కు పంపండి
♦ పోస్టుమార్టం వీడియో ఫుటేజీని కూడా..
♦ పోలీసులకు హైకోర్టు ఆదేశం
♦ వాటిని విశ్లేషించి నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌కు ఆదేశం
♦ విచారణ నాలుగు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా, గోవిందరావుపేట మండల పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు పంపాలని హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని పరిశీలించి అభిప్రాయం తెలుపుతూ ఓ నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువునిచ్చింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలది బూటకపు ఎన్‌కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది.
ఉద్దేశపూర్వకంగానే కాల్చివేత
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారన్నారు. పోస్టుమార్టం సమయంలో మృతుల కుటుంబీకులను కూడా అనుమతించలేదని తెలిపారు. మృతుల కుటుంబీకులు ఫిర్యాదు చేయడానికి ముందే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, మృతుల పోస్టుమార్టం నివేదికలను కోరింది. దీంతో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాటిని ధర్మాసనం ముందుంచారు.
వాటిని పరిశీలించిన ధర్మాసనం బుల్లెట్ గాయాలతోనే చనిపోయినట్లు, అవి ఎదురు కాల్పుల వల్ల చోటు చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికల్లో ఉందని తెలిపారు. దీనికి రఘునాథ్ స్పందిస్తూ, ఈ పోస్టుమార్టం నివేదికలతో తాము విభేదిస్తున్నామని, డాక్టర్లు పోలీసులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినట్లు తమకు అనుమానంగా ఉందన్నారు. అందువల్ల ఈ నివేదికలను నిపుణులు విశ్లేషణకు పంపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపాలని తాము కోరుతున్నామన్నారు.
అదనపు ఏజీ స్పందిస్తూ, హైదరాబాద్‌లో నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడ కూడా ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారని తెలిపారు. అయితే ధర్మాసనం పిటిషనర్ కోరిన విధంగానే ఎయిమ్స్‌కు పోస్టుమార్టం నివేదికలు, వీడియో ఫుటేజీ పంపుతామంటూ ఆ మేర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ నివేదికలు, వీడియో ఫుటేజీ అందుకున్న తరువాత మూడు వారాలలోపు వాటి విశ్లేషణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశిస్తూ కోర్టువిచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.