కాపులకు ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు కల్పించాలి
Published Mon, Jan 2 2017 10:03 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
కొత్తపేట :
బీసీలకు ఏవిదమైన నష్టం కలగకుండా కాపులకు ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపు ఉద్యమ ప్రణాళికలో భాగంగా సోమవారం ఆయన కొత్తపేటలో రాష్ట్ర బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్‌ఎస్)ను కలసి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు కాపునాడు నాయకుడు చీకట్ల ప్రసాద్ స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు ఏవిధంగానూ నష్టం కలగకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక కేటగిరీలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని, బీసీ రిజర్వేషన్ల శాతం పెంచమని మీరు డిమాండ్ చేస్తే దానికి తామూ మద్దతు ఇస్తామని ముద్రగడ ఆర్‌ఎస్‌తో అన్నారు. సీఎం కాపులు, బీసీలను సమావేశపరచి బీసీలకు నష్టం కలగని ఫార్ములాతో వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తమకు అభ్యంతరం ఉండదని ఆర్‌ఎస్ అన్నారు. దానికి ముద్రగడ మద్దతు పలికారు. అదే విధంగా మంజునాథ కమిషన్ సర్వే సందర్భంగా ఒక రోజు బీసీలు, మరో రోజు కాపుల అభిప్రాయాలను సేకరించాలని ఆర్‌ఎస్ అనడంతో తమదీ అదే అభిప్రాయమని ముద్రగడ తెలిపారు. ముద్రగడ వెంట కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, కాపు నాయకులు మిండగుదిటి మోహన్, పాలూరి సత్యానందం, బండారు రాజా, ముత్యాల వీరభద్రరావు, సూధా గణపతి తదితరులు ఉన్నారు.
కాపు రిజర్వేషన్లు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా : ఎంపీ రవీంద్రబాబు
కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల అంశం పార్లమెంటులో ప్రస్తావిస్తానని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు జేఏసీ ప్రతినిధులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులతో కలసి సోమవారం ఎంపీ రవీంద్రబాబును రమణయ్య పేటలోని ఆయన స్వగృహంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఆ సందర్భంగా రవీంద్రబాబు పైమేరకు వారికి హామీ ఇచ్చారు.
Advertisement