చిరుత వచ్చేస్తోంది..
-
రెండు నెలల్లో వీవీకేలోకి రానున్న పులి
-
రూ.10 లక్షలతో నైట్ షల్టర్ నిర్మాణం
-
పూర్తయిన ఎన్‌క్లోజర్ టెండర్లు
-
చిరుత రాకకు డీఎఫ్‌ఓ ప్రత్యేక చొరవ
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అటవీ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగైన చిరుతపులిని త్వరలో నగరంలోని జూ పార్క్(వీవీకే)లో చూసే అవకాశం కలుగనుంది. ఇందుకోసం జిల్లా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం తీవ్ర కసరత్తు చేస్తోంది. దసరా నాటికి వీవీకేలో చిరుత గాండ్రింపు వినబడుతుందని అధికారులు అంటున్నారు.
నైట్‌షల్టర్ నిర్మాణం పూర్తి...
వన విజ్ఞాన కేంద్రంలో చిరుత నివాసానికి అవసరమైన నైట్‌షెల్టర్(డోమ్)ను ఇప్పటికే రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఎన్‌క్లోజర్ ఏర్పాటుకు కూడా టెండర్లు పూర్తయ్యాయి. దీని నిర్మాణ వ్యయాన్ని రూ.19 లక్షలుగా అధికారులు నిర్ణయించగా, ఏఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ.18 లక్షలకు టెండర్ వేసింది. రూ.లక్ష లెస్‌కు టెండర్ దాఖలు కావడంతో ప్రభుత్వం ఆ సంస్థకే పనులు అప్పగించింది. చిరుతను తీసుకొచ్చే విషయంలో ఇంతకాలం వెనుకాడిన అధికారులు.. ఎట్టకేలకు ఎన్‌క్లోజర్ కోసం టెండర్లు పిలవడంతో ప్రక్రియ తుది దశకు వచ్చిందనే చెప్పాలి.
నెహ్రూపార్క్ నుంచి వరంగల్‌కు..
దక్షిణ భారత దేశంలో అతిపెద్దదైన హైదరాబాద్‌లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ నుంచి చిరుతను వీవీకేకు తీసకురానున్నారు. ఈ దిశగా పనులు పూర్తయ్యాయి. ఎన్‌క్లోజర్ ఏర్పాటు కాగానే చిరుత రానుంది. ఇందుకవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. చిరుత 20 నుంచి 30 పీట్లు ఎగిరేలా స్థలం కేటాయించారు. జూపార్క్ వెనుక పద్మాక్షి గుట్ట సమీపంలోని ఖాళీ స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించడంతో భూ సమస్య కూడా తీరినట్లయింది. పనులు సాఫీగా సాగితే మరో రెండు నెలల్లో వీవీకేలో చిరుత దర్శనమివ్వనుంది.
బడ్జెటే ‘పెద్ద’ సమస్య
వీవీకేకు పెద్ద జంతువులను తీసుకొచ్చేందుకు గతంలో స్థలం సమస్య ఉండేది. ప్రభుత్వం భూమి ఇస్తున్నందున ఆ సమస్య తీరింది. తెల్లపులి, పెద్దపులిని కూడా ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎన్‌క్లోజర్స్ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్నది. లక్షల రూపాయల వ్యయం అవుతుంది. అందుకే ప్రస్తుతం చిరుతపులి కోసం పనులు వేగవంతం చేశాం. వన్యప్రాణి సప్తాహం నాటికి జూలో చిరుతను ఉంచాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నాం. – పురుషోత్తం, వన్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓ
leopard, Wild Life, night Shelter