నిర్లక్ష్యం నీడన మున్సిపల్‌ స్కూళ్లు | municipal high schools, nirlaksham | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం నీడన మున్సిపల్‌ స్కూళ్లు

Published Thu, Sep 8 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

నిర్లక్ష్యం నీడన మున్సిపల్‌ స్కూళ్లు

నిర్లక్ష్యం నీడన మున్సిపల్‌ స్కూళ్లు

 
– పర్యవేక్షణ లేక గాడి తప్పిన విద్యాబోధన 
– టీచర్ల గైర్హాజరీపై ప్రశ్నించే నాథుడే కరువు
– సైన్స్‌ ల్యాబ్‌లు లేక నిలిచిపోయిన ప్రయోగాలు
– ప్రాథమిక పాఠశాలల్లో నెలల తరబడి హెచ్‌ఎంలు కరువు
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని మున్సిపల్‌ స్కూళ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. విద్యాబోధన గాడి తప్పుతోంది. సైన్స్‌ ల్యాబ్‌లు, అందులో పరికరాలు లేక సగానికి పైగా స్కూళ్లల్లో ప్రాక్టికల్‌ తరగతులు నిలిచిపోయాయి. ఇదే అదునుగా  సబ్జెక్టు టీచర్లు తరగతులకు గైర్హాజరవుతున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. 
రాష్ట్రంలోని 58 మున్సిపాల్టీల్లో 2,115 మున్సిపల్‌ స్కూళ్లున్నాయి. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకూ 3.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2007 వరకూ ఇవన్నీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పర్యవేక్షణలో ఉండేవి. ఆ తరువాత జరిగిన పాలనా పరమైన మార్పుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం మున్సిపల్‌ స్కూళ్లపై అజమాయిషీ మున్సిపాల్టీలదే అయినప్పటికీ, స్కూళ్ల  పర్యవేక్షణ కోసమంటూ అధికారులెవ్వరూ లేకుండా పోయారు. రోజువారీగా ఏ స్కూలు ఎలా పనిచేస్తుంది, ఎంత మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు,..తరగతులు ఎలా జరుగుతున్నాయన్న విషయాలను పరిశీలించి అటు మున్సిపల్‌ అధికారులు, ఇటు ప్రభుత్వానికి  నివేదించే అధికారులే లేకుండా పోయారు. ఎడ్యుకేషన్‌ అధికారులంటూ లేని కారణంగా చాలా చోట్ల మున్సిపల్‌ స్కూళ్ల నిర్వహణ గందరగోళంగా మారుతోంది. మున్సిపల్‌ స్కూళ్లకు సర్వీస్‌ రూల్స్‌ లేకపోవడంతో పలు చోట్ల ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా లేకుండా పోయింది. నెల్లూరు మున్సిపల్‌ స్కూల్లో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు ఆరు నెలలు సెలవు ఉన్నా అధికారులు గుర్తించ లేదంటే పర్యవేక్షణ ఎలా ఉందో అవగతమవుతుంది. ఇప్పటికీ చాలా చోట్ల ప్రాథమిక స్కూళ్లల్లో హెచ్‌ఎం పోస్టులు లేవు. 200 కంటే ఎక్కువ స్కూళ్లల్లో టేబుళ్లు, కుర్చీల వంటి ఫర్నీచర్‌ లేదు. విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపాల్టీల్లోని దాదాపు 30 స్కూళ్లల్లో తరగతి గదుల సమస్య నెలకొంది. దీంతో విద్యార్థులు ఆవరణలోని చెట్ల కింద, ప్రహరీ నీడన చదువులు సాగించాల్సి వస్తోంది. 
 
ఎక్కడా సైన్స్‌ ల్యాబ్‌లు లేవాయె...
పదో తరగతి విద్యార్థులకు రోజూ ఒక పిరియడ్‌ ప్రాక్టికల్స్‌ తరగతులు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, నేచురల్‌ సైన్స్‌ విద్యార్థులకు ప్రయోగశాలలు ఉంటేనే ఈ తరహా తరగతులు జరుగుతాయి. అయితే 80 శాతం మున్సిపల్‌ స్కూళ్లల్లో సైన్స్‌ ల్యాబ్‌లు లేవు. కనీసం ప్రయోగాలకు సంబంధించిన మైక్రోస్కోప్, «ధర్మామీటర్, సింపుల్‌ బ్యాలెన్స్‌ వంటి పరికరాలు కూడా లేవు. ఇకపోతే ద్రావకాల్లో నిల్వ ఉంచి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు కోసం ఉంచాల్సిన వివిధ రకాల జంతువుల బొమ్మలు, చార్టులు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రయోగాత్మక తరగతులు నిర్వహించడం ఉపాధ్యాయులకు కష్టంగా మారింది. సదుపాయాలేమీ లేకుండా కార్పొరేట్‌ స్కూళ్లతో పోటీపడి ఫలితాలు సాధించాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. 
 
ఆరు నెలల్లో అన్నీ....
వచ్చే ఆరు నెలల్లో మున్సిపల్‌ స్కూళ్లును మెరుగైన సదుపాయాలు కల్పించడమే కాకుండా సమస్యలన్నింటినీ తీరుస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పీ. నారాయణ సమాధానమిచ్చారు. ఇందుకోసం సీఎం చంద్రబాబునాయుడు రూ.50 కోట్ల సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. అంతేకాకుండా తిరుపతిలో టీటీడీ, నెల్లూరులో పోర్టు అధికారులు, గుంటూరు, విజయవాడల్లో ఎల్‌ అండ్‌ టీ కంపెనీలు మున్సిపల్‌ స్కూళ్ల అభివృద్ధికి నిధులు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో సైన్స్‌ ల్యాబ్‌లు, కంప్యూటర్ల ఏర్పాటు చేస్తామన్నారు.  

Advertisement
Advertisement