దళిత సర్పంచ్ ఫిర్యాదుపై చర్యలేవీ
Published Thu, Aug 3 2017 11:22 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM
ఎస్పీ విశాల్‌గున్నికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫిర్యాదు
కాకినాడ : స్పష్టమైన ఆధారాలున్నా ఓ దళిత సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆలమూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎస్పీ విశాల్‌గున్నికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కాకినాడలో ఎస్పీని కలిసి ఈ అంశంపై చర్చించారు. ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామ సర్పంచ్ డెక్కాపాటి పాప తమ గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాన్ని ప్రశ్నించడంతో మే 20వ తేదీన అడ్డుచెప్పారన్నారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అక్కడ నిర్మాణం చేస్తున్న మద్దిరాజు కామరాజు ఆమెపై దౌర్జన్యం చేసి కులంపేరుతో దుర్భాషలాడారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. పైగా ఆమెపై పారతో దాడి చేసి హత్యాయత్నం కూడా చేశారన్నారు. ఇందుకు సంబంధించి రికార్డింగ్‌లు, స్పష్టమైన ఆధారాలతో ఆలమూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్య తీసుకోవడలేదని ఎస్పీకి వివరించారు. దళిత సర్పంచ్‌పై దురుసుగా వ్యవహరించి అవమానకరంగా ప్రవర్తించిన అక్కడి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని జగ్గిరెడ్డి చెప్పారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వెంటనే డీఎస్పీతో మాట్లాడారు. వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీటీసీ లంక వెంకటరమణ, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ తదితరులు ఉన్నారు.
Advertisement