‘ఈరోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయకపోతుందా, మా వేతనాలు పెరగక పోతాయా’.
► ముప్పై ఏళ్లుగా ఎదురుచూపులే..
► స్వరాష్ట్రంలోనూ దుర్భర జీవితం
► ఇదీ పీటీఎఫ్‌ల దుస్థితి
► ఉమ్మడి జిల్లాలో 142 మంది ఉద్యోగులు
► 8 నెలలుగా అందని వేతనం
బీర్కూర్(బాన్సువాడ): ‘ఈరోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయకపోతుందా, మా వేతనాలు పెరగక పోతాయా’.. అంటూ ముప్‌పై ఏళ్లుగా పీటీఎఫ్‌లు(పార్ట్ టైం ప్యూన్) వెట్టిచాకిరీ చేస్తూనే ఉన్నారు. వీరితోపాటు ఇతర ఉద్యోగాల్లో చేరినవారు పదోన్నతులు పొంది రూ.వేలల్లో వేతనాలు పొందుతూ రిటైర్మెంట్‌కు దగ్గరపడినా, పీటీఎఫ్‌ల జీవితాల్లో మాత్రం వెలుగు రాలేదు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలోనే వీరు విధులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 142 మంది..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీవో నంబర్ 212 ప్రకారం 102 మంది, జీవో 112 ప్రకారం 32 మంది పీటీఎఫ్‌లు ఆయా పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1987లో విధుల్లో చేరిన పీటీఎఫ్‌ల సర్వీసు మొత్తం పుణ్యకాలానికే సరిపోయింది. అయినా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి పర్మినెంట్ లేదు సరికదా వేతనం సైతం ఆశించిన స్థాయిలో పెరగలేదు.
1987లో రూ.75తో ప్రారంభమైన వేతనం ప్రస్తుతం రూ.4వేలు.
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటిన ప్రస్తుత తరుణంలో వీరి వేతనం గతేడాది అక్టోబర్ వరకు నెలకు రూ. 1623గానే ఉంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెరగలేదు. గతేడాది అక్టోబర్‌లో రూ.4వేలకు వేతనం పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం 8నెలలైనా ఇంకా నయాపైస మంజూరు చేయలేదు. అయినా 30 ఏళ్లుగా ఏ క్షణాన పాలకులు, అధికారులు కనికరిస్తారో అంటూ ఆశావాహ దృక్పథంతో జీవనం సాగిస్తున్నారు పీటీఎఫ్‌లు. ఆశవర్కర్లకు, అంగన్‌వాడీ టీచర్లకు, ఐకేపీ బుక్‌కీపర్‌లకు, వీఆర్‌ఏలు, వీవీలకు విరివిగా వేతనాలు పెంచిన ప్రభుత్వం పీటీఎఫ్‌ల వేతనాలను పెంచాలని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
8నెళ్లుగా వేతనాలు ఇస్తలేరు..
ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. కాని మా సమస్యలు పరిష్కారానికి నోచుకోలే. తమ సేవలను ప్రభుత్వం గుర్తించి సర్వీస్ రెగ్యులర్ చేసి న్యాయం చేయాలి. 8నెలలుగా వేతనాలు ఇస్తలేరు. రంజాన్ పండుగకైనా వస్తాయని ఆశతో ఎదురు చూసినా రాలేదు –హఫీజ్, పీటీఎఫ్, బోర్లంక్యాంపు
శ్రమ దోపిడీకి గురవుతున్నాం..
30 ఏళ్లుగా ఉద్యోగం పర్మినెంట్ అవుతుందేమోననే ఆశతో తక్కువ వేతనం వచ్చినా పని చేస్తూ వస్తున్నాం. ఉదయం 7 గంటలకు పని మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు చేస్తున్నం. శ్రమకు తగిన వేతనం లభించక శ్రమ దోపిడీకి గురవుతున్నాం. తమకన్నా ఉపాధి కూలీలు నయం. –వీరేశం, పీటీఎఫ్, జెడ్పీ హైస్కల్, కోనాపూర్