పోస్టు మాస్టర్ల భర్తీకి బ్రేక్‌? | Post master brake replacement ? | Sakshi
Sakshi News home page

పోస్టు మాస్టర్ల భర్తీకి బ్రేక్‌?

Published Thu, Aug 11 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

దరఖాస్తులను పోస్టు చేసేందుకు క్యూలైన్‌లో నిలుచున్న నిరుద్యోగులు (ఫైల్‌)

దరఖాస్తులను పోస్టు చేసేందుకు క్యూలైన్‌లో నిలుచున్న నిరుద్యోగులు (ఫైల్‌)

  • 50 వేల దరఖాస్తులు బుట్టదాఖలు
  • రూ.10 లక్షలు ఖర్చు చేసిన నిరుద్యోగులు
  • నిరుద్యోగులతో పోస్టల్‌ శాఖ చెలగాటం
  • ఆన్‌లైన్‌ విధానం ద్వారా భర్తీ చేసే యోచనలో పోస్టల్‌ శాఖ
  • ఖమ్మం గాంధీచౌక్‌:
     గ్రామీణ డాక్‌ సేవక్‌ బ్రాంచి పోస్టు మాస్టర్ల ఖాళీల భర్తీ వ్యవహారం అడ్డం తిరిగింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 51 బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారుల అనుమతితో జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 27 నుంచి జూన్‌ 25 వ తేదీ లోగా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ పోస్టుల్లో రిజర్వేషన్లను కూడా కల్పించారు. దీంతో 10వ తరగతి మొదలు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు చదివిన నిరుద్యోగులు, బీటెక్‌ చదివిన నిరుద్యోగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.  51 పోస్టులు కావటంతో ఒక్కో నిరుద్యోగి తన రిజర్వేషన్‌కు అర్హత ఉన్న ప్రతి చోట దరఖాస్తు చేసుకున్నారు.  దరఖాస్తులను స్పీడ్‌ పోస్టు, రిజిస్టర్‌ పోస్టుల్లో మాత్రమే పంపాలని పేర్కొనటంతో అభ్యర్థులకు మరింత ఖర్చయింది. ఒక్కో దరఖాస్తుకు రూ.50 ల వరకు ఖర్చు కాగా, పట్టణాలకు వచ్చి స్పీడ్‌ పోస్టు, రిజిష్టర్‌ పోస్టు చేయడానికి మరో రవాణా ఖర్చులు మరో రూ.50 అయ్యాయి. జిల్లాలో ఉన్న 51 పోస్టులకు మొత్తం 50 వేల దరఖాస్తులు అందాయి.
    దరఖాస్తులు బుట్టదాఖలు
    నిరుద్యోగులు కోటి ఆశలతో గ్రామీణ డాక్‌ సేవక్‌ బ్రాంచి పోస్టు మాస్టర్‌ పోస్టులకు చేసుకున్న దరఖాస్తులు బుట్టదాఖలు కానున్నాయి. దరఖాస్తుల గడువు ముగిశాక దాదాపు నెల రోజుల కాలంలో పోస్టులు భర్తీ జరుగుతాయని ప్రచారం జరిగింది. ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా పోస్టు భర్తీకి నెల రోజుల గడువు పడుతుందని భావించారు. అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణయించిన విధంగా భద్రపరిచారు. గతంలో ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ విజయవాడ సర్కిల్‌లో ఉండేది. రాష్ట్రం విడిపోవడంతో ఇటీవల ఖమ్మం డివిజన్‌ను హైదరాబాద్‌ సర్కిల్‌కు మార్చారు. దీంతో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో సర్కిల్‌ ఉన్నతాధికారులు బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టుల భర్తీని కూడా నిలిపివేయాలని జిల్లా అధికారులకు సూచనలు చేశారు. దీంతో జిల్లా పోస్టల్‌ శాఖ అధికారులు పోస్టుల భర్తీ వ్యవహారాన్ని పక్కన పెట్టారు.
    ఆన్‌లైన్‌ విధానం వైపు చర్యలు..
    బ్రాంచి పోస్టు మాస్టర్‌ భర్తీలో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సేకరించే విధానాన్ని అనుసరించాలని పోస్టల్‌ శాఖ భావిస్తుంది. పారదర్శకతను పాటించటం కోసం, ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండటం కోసం ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించి చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు జిల్లా స్థాయి పోస్టల్‌ అధికారులకు పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కూడా సూచనలు చేశారు.
    రూ.10 లక్షల ఖర్చు ...
    బ్రాంచి పోస్టు మాస్టర్‌ ఎక్కడో ఓ చోట వస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆశపడి భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 50 వేల దరఖాస్తులను దరఖాస్తు చేసుకోవటానికి నిరుద్యోగులు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారని పోస్టల్‌ శాఖ అధికారులు, ఉద్యోగులే లెక్కలేశారు.  ఖర్చులు మొత్తంగా దరఖాస్తుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఖర్చు చేశారు.
    నిరుద్యోగులతో పోస్టల్‌ శాఖ చెలగాటం
    నిరుద్యోగులతో పోస్టల్‌ శాఖ చెలగాటమాడుతుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. దరఖాస్తులు చేసి 50 రోజులు గడిచినప్పటికీ ఇంత వరకు పోస్టుల భర్తీ విషయంలో ఆ శాఖ ఎటువంటి ప్రకటనలు చేయటం లేదు. దీంతో దరఖాస్తు చేసి పోస్టులు వస్తాయని ఆశగా ఉన్న  అభ్యర్థులు జిల్లా ప్రధాన పోస్టాఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
    ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం : ఖమ్మం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ మల్లికార్జున శర్మ
    బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టుల ప్రక్రియపై ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తాం. పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించటం లేదు. అధికారుల నుంచి జారీ అయ్యే విధానాలతో పోస్టుల భర్తీ జరుగుతుంది. శాఖాపరమైన నిర్ణయాలను పాటిస్తాం.       

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement